Husnabad | హుస్నాబాద్ ఎల్లమ్మ గుడి భూమి క‌బ్జాపై ఎంక్వైరీ..

హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ గుడికి చెందిన భూమిని దేవాలయ ఈవో ఆక్రమించారని భూదాత కుటుంబం చేసిన ఫిర్యాదుతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారంగా డిప్యూటీ కమిషనర్ విచారణ చేపట్టారు.

విధాత :

హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ గుడికి చెందిన భూమిని దేవాలయ ఈవో ఆక్రమించారని భూదాత కుటుంబం చేసిన ఫిర్యాదుతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశానుసారంగా డిప్యూటీ కమిషనర్ విచారణ చేపట్టారు. గుడికి భూమి దానం చేసిన దాత కుటుంబ సభ్యుడు సయ్యద్ రఫీ వివరాల ప్రకారం.. వారి కుటుంబం గతంలో హుస్నాబాద్ సర్వే నంబర్ 265లో 4 ఎకరాలు 4 గుంటలు ఎల్లమ్మ గుడికి దానం చేసినట్టు చెప్పారు. ఆ భూమికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 264లోని 32½ గుంటల మిగులు భూమిని గుడి ఈవో పీ.కిషన్‌రావు అక్రమంగా క‌బ్జా చేయడానికి యత్నించారని ఆయన ఆరోపించారు. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్లు ఉన్నప్పటికీ ఈవో కిషన్‌రావు వాటిని పట్టించుకోకుండా కోర్టు అధ్వర్యంలో అడ్వకేట్ కమిషనర్ వేసిన హద్దు రాళ్లను తొలగించారని ఆరోపించారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా రాత్రివేళ లైట్లు ఏర్పాటు చేసి పిలర్లు వేశారని చెప్పారు. రాజకీయ అండతో “ఏం చేస్తావో చేసుకో” అంటూ ఈవో బెదిరించారని ఆరోపించారు.

ఈ విషయంపై మంత్రి సురేఖకు గతంలో ఫిర్యాదు చేయగా, ఆమె వెంటనే స్పందించి జాయింట్ సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు రఫీ తెలిపారు. అయితే నెలల తరబడి అధికారులు చర్యలు తీసుకోలేదని, దీనితో కోర్టు ద్వారా ఎఫ్ ఐఆర్ కోసం పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే, జరిగిన డిప్యూటీ కమిషనర్ విచారణకు ఈవో కిషన్‌రావు, ఫిర్యాదుదారుల్నే పిలిచినప్పటికీ, సంబంధం లేని పలువురు స్థానిక రాజకీయ నేతలు, ఈవో అనుకూల శ్రేణులు పెద్ద సంఖ్యలో విచారణ స్థలానికి చేరుకున్నారని రఫీ చెప్పారు. విచారణను దారి తప్పించే ప్రయత్నం చేశారని రఫి ఆరోపించారు.

అయితే, ఈవో కిషన్‌రావు చేసిన నిర్మాణం సర్వే నంబర్ 265లో పడుతుందని ఈవో వాదించారని.. “అయితే కోర్టు సూట్ భూమి ఏది?” అన్న ప్రశ్నకు ఈవో సమాధానం చెప్పలేదని రఫీ తెలిపారు. ఆక్రమణ సమయంలో తీసిన ఫోటోలు, అడ్వకేట్ కమిషనర్ రిపోర్టు, ఆర్టీఐ ద్వారా తెచ్చుకున్న మున్సిపాలిటీ రికార్డులు, అనుమతులు లేవని, భూమి సర్వే రిపోర్టులు లాంటి ఆధారాలను డిప్యూటీ కమిషనర్‌కు అందజేశానని రఫి చెప్పారు. అలాగే, రఫీ తండ్రి ఎస్.కె. షర్ఫుద్దీన్ ను కూడా అధికారులు పిలిచి భూమిపై సమాచారం తీసుకున్నారన్నారు.

తొమ్మిది నెలల క్రితమే మంత్రి జాయింట్ సర్వేకి ఆదేశించినా, ఇప్పటికీ విచారణ జరగకపోవడం ఉద్దేశపూర్వక ఆలస్యంగా కనిపిస్తుందని రఫీ ఆరోపించారు. జాయింట్ సర్వే జరిగితే అసలు హద్దులు వివరాలు, ఆక్రమణపై క్లారిటీ వస్తుందని చెప్పారు. సమర్పించిన అన్ని ఆధారాలను డిప్యూటీ కమిషనర్ పరిశీలించిన నేపథ్యంలో, ఈ ఓ కిషన్‌రావు దురాక్రమణ చేశారా? కోర్టు ఆదేశాలను ధిక్కరించారా? అనే కోణంలో విస్తృత దర్యాప్తు జరిగిందని రఫీ చెప్పారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని రఫి ఆశా భావం వ్యక్తం చేశారు.

Latest News