విధాత: సీఎం కేసీఆర్ ప్రభుత్వ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో పారిశ్రామికాభివృద్ధిలో ట్రైలర్ మాత్రమే చూశారని, మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 24 గంటలు మంచినీటి వసతితో పాటు భారీగా మౌలిక వసతులు కల్పిస్తామని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమాజిగూడలో మల్లాపూర్, గాంధీనగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యుత్తు, పారిశ్రామిక రంగ అభివృద్ధిపైన, స్వయం పాలనపైన ఎన్నో అనుమానాలుండేవన్నారు. అలాంటి అనుమానాలన్నిపారద్రోలి వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని, టీఎస్ ఐపాస్ తెచ్చి పారిశ్రామిక ప్రగతిని ముందుకు దూకించామన్నారు.
పారిశ్రామిక వేత్తలకు సత్వర అనుమతులు, రాయితీలు ఇచ్చామన్నారు. దీంతో ప్రపంచ దేశాల నుంచి తెలంగాణ, హైద్రాబాద్‌లో పలు ప్రఖ్యాత కంపనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. దేశంలోనే ఇప్పుడు అత్యధిక తలసరి ఆదాయమున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 10 రోజులు కరెంటు లేకపోయినా అడిగేవారు లేరని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 10 నిమిషాలు కరెంటు పోతే ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నారన్నారు.
కర్ణాటక నుంచి నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం శివకుమార్‌కు ఆ పార్టీ నాయకులు సరిగ్గా స్క్రిప్ట్ ఇవ్వకపోవడంతో, మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నారని, 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణకు వచ్చి కర్ణాటకలో గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా సదస్సులో పాల్గొన్న పలువురు రాయితీలు మళ్లీ బీఆరెస్ ప్రభుత్వం వచ్చాకా కొత్త పరిశ్రమలకు మాదిరిగా పాత కంపనీలకు కూతా ప్రోత్సాహాకాలు, రాయితీలు ఇవ్వాలని కోరారు.