విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజుల నుంచి ప్రగతి భవన్‌కు పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి.. రేపో మాపో పులి బయటకు వస్తది.. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలు, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేండ్లు అన్ని మళ్లా తొర్రలకే పోతాయని కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ హయాంలో రూ. 200 పెన్షన్ వచ్చేది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రూ. 75 పెన్షన్ ఇచ్చేది. ఇవాళ మీరు దయతో కేసీఆర్‌ను గెలిపించుకున్న తర్వాత 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగింది. 2 వేల పెన్షన్ అయింది. దివ్యాంగులకు పెన్షన్లు పెంచాం. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. బీడీలు చుట్టే అక్కాచెళ్లెళ్లు 16 రాష్ట్రాల్లో ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నారా..? ఆ దిశగా ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? రెండున్నర లక్షల మంది ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
మన దగ్గర ఊరికి పదో, పదిహేను మంది బీడీ కార్మికులు మిగిలిపోయి ఉంటారని కేటీఆర్ తెలిపారు. తప్పకుండా వారిని కూడా కడుపులో పెట్టి చూసుకుంటాం.. మిగిలిపోయిన వారికి కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మాది. మీ మనసులో ఉన్న కోరిక కేసీఆర్‌కు తెలుసు. మీరు ఏమనుకుంటున్నారో తెలుసు. మరి కాంగ్రెసోడు కూడా చెప్పవటే కదా..? బీజేపోడు కూడా నరకవట్టే కదా..? మరి కేసీఆర్ చెప్పకపాయే.. ఏం సంగతి అని ఊర్లళ్ల ఎదురుచూస్తున్నారు.. అది మాకు తెలుసు. కేసీఆర్ మొత్తం లెక్కాపత్రం రాసుకుంటున్నారు. రేపో మాపో పులి బయటకు వస్తది. వచ్చిన తర్వాత ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లా తొర్రలకే పోతాయి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి.. ఇవాళ ఎగిరెగిరి పడుతున్న నక్కలు, నీలుగుతున్న నక్కలు, మూలుగుతున్న తోడేండ్లు అన్ని మళ్లా తొర్రలకే పోతాయని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.