ప్రభుత్వ భూమి ఒక్క గజం వదలం

ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలం... ఎవ్వరు ఆక్రమించినా వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా

  • Publish Date - January 20, 2024 / 02:06 PM IST

– ఆక్రమణదారులపై చర్యలు

– వరంగల్ సమగ్రాభివృద్ధికి కృషి

– మేడారం జాతరకు తగిన నిధులు

– ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం

– వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలం… ఎవ్వరు ఆక్రమించినా వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష సమావేశం అనంతరం మంత్రులు మీడియా సమావేశంలో మాట్లాడారు. సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వివిధ శాఖల నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, కుడా, జీ డబ్ల్యు ఎంసీ, నేషనల్ హైవేస్, ఐటీడీఏ, హౌసింగ్, పోలీస్, ఫారెస్ట్, దేవాదాయ శాఖల పనితీరు, చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది వేసవికాలం కాబట్టి ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఏ స్టేజిలో ఉన్నా పూర్తిచేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. వచ్చే నెలలో మేడారం జాతర ఉన్న నేపథ్యంలో ఈనెల 30వ తేదీన మేడారం వస్తామని, అక్కడ ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని, జాతరపై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టాలన్నారు. అట్టడుగు స్థాయిలోని నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందాలన్నారు. పంటల సాగుకు సాగునీరు అందించకపోతే ఇబ్బందులు వస్తాయని, కాబట్టి ఆ శాఖ అధికారులు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఏ పనికైనా అడ్డగోలుగా అంచనా వ్యయం వేయకుండా అధికారులు చూసుకోవాలన్నారు. తాను కూడా ఎక్కడో చోట ఆకస్మికంగా తనిఖీ చేస్తానని పేర్కొన్నారు. 

– మేడారం జాతరకు అధిక నిధులు: మంత్రి సీతక్క

ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరగబోయే బడ్జెట్లో కావాల్సిన అంశాలపై ఈ సమావేశం ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను మరిన్ని కేటాయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. మేడారం జాతరకు ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. జాతరకు భక్తులు పెద్ద సంఖ్యల్లో వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాలని అన్నారు. 25, 28వ తేదీల్లో మేడారం జాతరను సందర్శించాలని మంత్రి సీతక్క కోరారు. అదేవిధంగా జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు చిన్న చిన్న వాగులు, పెద్ద పెద్ద చెరువులు చాలా ఉన్నాయని, జిల్లా అభివృద్ధికి నిధులు అధికంగా మంజూరు చేయాలని మంత్రి కోరారు. రామప్ప లక్నవరం సరస్సులను అనుసంధానం చేయడం కోసం శాశ్వత గ్రావిటీ కాలువల నిర్మాణం కోసం భూసేకరణ జరిగిందని, పెండింగ్ లో ఉన్న ల్యాండ్ అక్విటేషన్ కు డబ్బులు అందించాలన్నారు. 

– మామునూరు ఎయిపోర్టు అభివృద్ధి: మంత్రి సురేఖ

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మామునూరు ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ చేయాలని, ఇందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. త్వరలోనే ఎయిర్ పోర్టు భూములను పరిశీలించేందుకు మంత్రి రావాలని కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఫ్రూట్ మార్కెట్ తో పాటు వరంగల్లో కూరగాయల మార్కెట్ అంశాన్ని ప్రస్తావించారు. చాలావరకు ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు లేవని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పరిధిలో ఉన్న మూడు మండలాలు అభివృద్ధికి అధికారులు ప్రణాళికతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ మహానగర పాలక సంస్థకు అధిక నిధులు కేటాయించాలని కోరారు. నాలాలు ఆక్రమణకు గురవడంతో వర్షాకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతున్నాయని, ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ విలీనం చేసిన గ్రామాల్లో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పేరుతో గత ప్రభుత్వం జీవోను తెచ్చిందని, దానిని రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ వే కోసం అవసరమైన మేరకే భూములను తీసుకోవాలని ఎక్కువ తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, శివలింగయ్య, ఇలా త్రిపాఠి, భవేష్ మిశ్రా, అద్వైత్ కుమార్ సింగ్, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, జిల్లాల ఎస్పీలు శబరీష్, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, కిరణ్ కారే, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.