విధాత : మా ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యంఎవరికి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో ఉన్నారని బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ ప్రభుత్వాన్ని ముట్టుకునే ధైర్యం కేసీఆర్‌కు, బీజేపీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చే సాహసం ఎవరూ చేయలేరని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, ఎంపీగా వైఫల్యం చెందిన వారిలో కరీంనగర్’ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నెంబర్ వన్ అని విమర్శించారు. జాతీయ పార్టీలుగా వేర్వేరు సైద్ధాంతిక బాటలో సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ ఎప్పటికి కలిసే ప్రసక్తి లేదన్నారు. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అంటే ఇన్నాళ్లు కొందరు నమ్మలేదని, కానీ బండి సంజయ్ వ్యాఖ్యల వల్ల ఇప్పుడు అందరూ నమ్ముతున్నారని మంత్రి అన్నారు. రెండు పార్టీల సమాచారం ఒకరికొకరికి తెలుసనడానికి బండి సంజయ్ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. త్వరలోనే బీఆరెస్ రెండుగా చీలబోతుందని జోస్యం చెప్పారు. శ్రీరాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందని, ప్రజలకు చేసేందేమి లేక మత రాజకీయాలు చేస్తుందన్నారు.