- కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీ దాక చేరింది
- ఆ అంశంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్నది
- రాష్ట్రంలో ఆ కుటుంబ అభివృద్ధి మాత్రమే
- జమ్మికుంట జనగర్జన సభలో రాజ్‌నాథ్‌సింగ్
విధాత బ్యూరో, కరీంనగర్: తెలంగాణలో ప్రభుత్వం ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని, మొత్తం అవినీతి మయం అయిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు చేరిందని అన్నారు. సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంటలో జనగర్జన పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ ప్రజల ఉద్యమానికి బీజేపీ అండగా నిలిచిందని చెప్పారు.
1984లో బీజేపీ రెండు లోక్‌సభ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తే, అందులో ఒకటి తెలంగాణ నుండి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాణి రుద్రమ, కొమురం భీమ్ వంటి ఎందరో వీరులనుకన్న చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే, ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతున్నదని, మరి తెలంగాణలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. బీజేపీ సారథ్యంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గుజరాత్‌లో రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంటే, గడచిన పదేళ్లలో తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన నిలదీశారు. తెలంగాణలో ఆ ఒక్క కుటుంబ అభివృద్ధి మాత్రమే జరుగుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే అధికారం చెలాయిస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకుండా కేసీఆర్ ఉండలేరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే లీకేజీల ప్రభుత్వంగా మారిపోయిందని మండిపడ్డారు. గతంలో అనేకమార్లు ఆ పార్టీ ఇచ్చిన వాగ్దానాలేవి నెరవేరలేదన్నారు.