నిన్న కోమటిరెడ్డి.. నేడు తుమ్మల.. సకాలంలో విధులకు రాని ఉద్యోగులు

సచివాలయంలో ఉద్యోగుల పనితీరుపై దృష్టి పెట్టిన మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఆర్‌ఆండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన శాఖ విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సకాలంలో విధులకు హాజరుకాని ఉద్యోగుల నిర్వాకంపై మండిపడ్డారు.

  • Publish Date - July 4, 2024 / 04:30 PM IST

తమ శాఖల విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు

విధాత : సచివాలయంలో ఉద్యోగుల పనితీరుపై దృష్టి పెట్టిన మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. నిన్న ఆర్‌ఆండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన శాఖ విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సకాలంలో విధులకు హాజరుకాని ఉద్యోగుల నిర్వాకంపై మండిపడ్డారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్దేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుంచి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. సమయ పాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా టీజీ కాబ్‌ డిపార్ట్ మెంట్ అధికారులతో తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్‌సీడీసీ అధికారులతో చర్చించారు. ఎన్‌సీడీసీ ద్వారా ప్రాంతీయ అవార్డుల పథకం కింద మంచి పనితీరు కనబర్చిన సహకార సంఘాలకు అవార్డుల ప్రధానం చేశారు. ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 25,000/- నగదు బహుమతి, సహకార మెరిట్‌కు ఎంపికైన ప్రాథమిక సహకార సంఘానికి రూ. 20,000/- నగదు బహుమతితో పాటు ప్రతి కేటగిరీ కింద సర్టిఫికెట్లు అందజేశారు.

Latest News