Site icon vidhaatha

పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారు.. తీరా చూస్తే..

Party

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిప్రెషన్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ఇంత వేగంగా ఏ పార్టీ పడిపోలేదు

పార్టీ మిగలదేమోననే భయంతో డిప్రెషన్‌, ఫ్రస్ట్రేషన్‌లో మాజీ సీఎం

లోక్‌సభ ఎన్నికలయ్యాక బీఆరెస్‌ మాయం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్‌ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిప్రెషన్‌లో, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్ లో మొదలైందని చెప్పారు. ఆదివారం కేసీఆర్‌ స్పీచ్‌ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారని అనిపించిందని తెలిపారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని స్పష్టం చేశారు. సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారు. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తప్ప.. బీఆరెస్‌లో మరెవరూ మిగలరు’ అని మంత్రి స్పష్టంచేశారు. జనరేటర్ పెట్టుకొని మీటింగ్ పెట్టి, టెక్నికల్ ప్రాబ్లం వస్తే.. దాన్ని వాడుకుని, కరెంట్ పోయిందని కేసీఆర్ అబద్ధం చెప్పారని మండిపడ్డారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని మంత్రి చెప్పారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారం పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదని తెలిపారు. గత పదేండ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇరిగేషన్ పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పచెప్తామని కేసీఆర్ ఒప్పుకున్నారని మంత్రి విమర్శించారు. జగన్ కలిసి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కేసీఆర్‌ కుట్ర చేశారని, ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందని ఉత్తమ్‌ ఆరోపించారు.

పోలీస్ శాఖను దుర్వినియోగం చేసిందే కేసీఆర్‌

పోలీస్ శాఖను ఎక్కువ దుర్వినియోగం చేసింది కేసీఆరేనని ఉత్తమ్‌ విమర్శించారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని ఇప్పుడు కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని చురకలు వేశారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనేనని, దాన్ని తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు.

Exit mobile version