Nellikal Lift | నెల్లిక‌ల్లు ఎత్తిపోత‌ల‌కు భూసేక‌ర‌ణ పూర్తి చేయండి : మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

Nellikal Lift | నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ‌చ్చే ఏప్రిల్ నెల చివ‌రి నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Nellikal Lift | హైద‌రాబాద్ : నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వ‌చ్చే ఏప్రిల్ నెల చివ‌రి నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

గురువారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ లోకసభ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయదీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, చీఫ్ ఇంజినీర్లు అజయ్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణ విషయమై రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరిపి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అదే సమయంలో అటవీశాఖ భూములకు అదనంగా చెల్లించాల్సిన చెల్లింపుల విషయమై ఆయన ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలము వెంటనే పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 23 కోట్ల విద్యుత్ బకాయిలతో పాటు పెరిగిన విద్యుత్ బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అదే విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు తీసుకోవడంతో పాటు మొత్తం ఐదు చెక్ డ్యామ్‌లకు తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఏయంఆర్పీ పరిధిలోని లో లెవల్ కెనాల్‌లో జంగిల్ కటింగ్ వెంటనే మొదలు పెట్టాలని ఆయన సూచించారు. దాంతో పాటు ఎన్ఎస్పీ కెనాల్ పరిధిలో ఉన్న మరమ్మతులను గుర్తించి వెంటనే పనులు మొదలు పెట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.