విధాత, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy)తో భేటీ కావడం ఆసక్తి రేపింది. రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జానారెడ్డితో సీఎం అంతరంగిక చర్చలు అనంతరం సచివాలయంలో కేబినెట్ భేటీకి బయలుదేరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, తన ఢిల్లీ పర్యటన.. కేబినెట్ భేటీ..త్వరలో శాసన సభ సమావేశాలు.. బీసీ రిజర్వేషన్ , ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తదితర కీలక అంశాలపై వారు చర్చించినట్లుగా సమాచారం. త్వరలో కేబినెట్ విస్తరణ ఊహాగానాలతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.
అలాగే కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న తాజాగా జానారెడ్డి, రేవంత్ రెడ్డిలపై చేసిన విమర్శలపై కూడా వారు చర్చించినట్లుగా సమాచారం. క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న జానారెడ్డి ప్రభుత్వం, పార్టీ పెద్ధలు అడిగితే సలహాలు ఇస్తానంటూ తాజాగా వ్యాఖ్యానించారు.
కులగణనపై తీన్మార్ మల్లన్న తనపై చేసిన విమర్శలను గాలి మాటలుగా కొట్టిపారేశారు. జానారెడ్డి ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలు ప్రస్తుతం కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.