- నిపుణుల కమిటీ సూచనలతో మళ్లీ పనులు
- మూడు దశాబ్దాల తరువాత పదోన్నతులు
- సింగూర్ డ్యామ్ భద్రతకు పక్కా చర్యలు
విధాత, హైదరాబాద్ : అర్ధంతరంగా నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్ధంగా కార్యాచరణకు పూనుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వెల్లడించారు. ఈ విషయమై శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. నీటిపారుదల రాష్ట్ర సలహాదారుడు ఆదిత్యదాస్ నాథ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్‌సీలు అంజద్ హుస్సేన్, రమేశ్ బాబు, ఆర్అండ్ఆర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఎల్‌బీసీ పనులను పునఃప్రారంభించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతో పాటు పాలనాపరమైన అనుమతులు పొందేందుకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు విషయంలో నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేగాకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. పునరుద్ధరణ పనులు ప్రణాళికా బద్దంగా నిర్వహించేందుకు లైడార్ సర్వే కూడా నిర్వహించబోతునట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పదోన్నతులు పూర్తి
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏఈ నుంచి సీఈ వరకు 47 మంది, అసిస్టెంట్ ఇంజినీర్ల నుండి డిప్యూటీ ఇంజినీర్ల వరకు 127 మంది, ఎస్ఈ ల నుండి సీఈ ల వరకు 13 మంది పదోన్నతులు పొందారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే పనులలో నిమగ్నం కావాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. సింగూర్ డ్యామ్‌ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న సమ్మక్క బరాజ్‌తోపాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్‌తో ఛత్తీస్‌గఢ్‌పై చూపే ప్రభావాలపై ఐఐటీ ఖరగ్‌పూర్ జరిపిన అధ్యయనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని ఉత్తమ్ వివరించారు.