విధాత, హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రారంభ కార్యక్రమంపై బుధవారం మధ్యాహ్నం జల సౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తరువాత హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి వైరాకు చేరుకుంటారు.
ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసి, బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఆ తరువాత హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరుతారన్నారు. కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించామని ఉత్తమ్ తెలిపారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సి లు అనిల్ కుమార్, నాగేందర్ రావు పాల్గొన్నారు.
9న ఉదయం జలాశయాలపై సమావేశం
జలాశయాలు, వాటి పరిస్థితి, పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించేందుకు ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నది. సచివాలయంలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొనున్నారు.