విధాత: 2024 డిసెంబర్ నాటికి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం జలసౌధలో సాగునీటి పారుదల ప్రాజెక్ట్‌ల పురోగతిపై సమీక్ష నిర్వహించిన మంత్రి కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో ఉన్నఅడ్డంకులన్నీ అధిగమించి సకాలంలో నీరందించాలన్నారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కవ చేశారు. అందుకు తగిన ఫలితం రాలేదన్నారు. అలా కాకుండా ఇప్పుడు అవసరమైన నిధులు వ్యయం చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలన్నారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజక వర్గానికి నీరందించే పనులు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.
రాబోయే జూన్ నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయకట్టు ఇచ్చే ప్రాజెక్టు లపై పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. కొత్త ఆయకట్టు కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే 5 ఏళ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామో సమాచారం సిద్ధం చేయాలన్నారు. అలాగే కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఉన్న ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణ, గోదావరి బేసిన్ లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు.
వేసవిలో చెరువుల పూడిక చేపట్టండి
వచ్చే వేసవి కాలంలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశిఆంచారు. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే జరగాలన్నారు. రైతుల పంటలకు చెరువల నీరు పెట్టడం ఆగిపోవడంతోనే పనులు మొదలు కావాలన్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి వర్షాకాలం లోపు అన్ని చెరువుల పనులు పూర్తి చేయాలన్నారు. ఐడీసీ పరిదిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో పని చేసే విదంగా చర్యలు చేపట్టాలన్నారు.
కాళేశ్వరంపై విచారణ ప్రారంభమైంది
గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్ట్ పైన విచారణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాయడం జరిగిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతున్నామన్నారు.
కోయినా నుంచి 100 టీఎంసీల నీరు ఇవ్వండి
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి 100 టీఎంసీ నీరు మనకు ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర కు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తి కి సంబందించిన వ్యయం అందిస్తామని సూచించామన్నారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ రావుతో పాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.