నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యాం

కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామని రాష్ట్ర నీటీ పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం

  • Publish Date - January 7, 2024 / 12:22 PM IST
  • సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తాం
  • నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వ నెల రోజుల పాలనలో ప్రజలకు మరింత దగ్గరయ్యామని రాష్ట్ర నీటీ పారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా వాటి అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రజాపాలన సభలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనంగా కనిపించిందన్నారు.


ప్రజా పాలన అంటే ఎలా ఉండాలో నెల రోజుల్లోనే చేసి చూపించామని, ప్రజలు తెలంగాణలో కొత్తగా స్వాతంత్రం వచ్చినట్టు భావిస్తున్నారన్నారు. ఒక నియంత పాలన అంతమైందన్న ఆనందంలో ఉన్నారని, ఇప్పుడు ప్రజలకు పాలకులు, అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వం నుంచి ఎలాంటి పాలన ఆశిస్తున్నారో అది వారికి అందుతుందన్నారు.


తన నీటి పారుదల శాఖ, పౌర సరఫరాల శాఖలో అనేక సమీక్షలు చేశామన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్, మెడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం లాంటి అంశాలలో సమీక్ష చేశామని, జ్యూడిషియల్ ఎంక్వరీ కోసం ఒక సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరామన్నారు. మెడిగడ్డ కూలిపోవడంపై, కాళేశ్వరం పై ఉన్నతాధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామని, ప్రజలకు, మీడియా వాళ్లకు వాస్తవాలు తెలియజేశామన్నారు.


పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని సీఎం రేవంత్ రెడ్డితో కలసి వెళ్లి కేంద్ర జల శక్తి మంత్రిని కలసి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు అన్ని రకాలుగా చర్యలు చెప్పడం జరిగిందన్నారు. నీటి పారుదల శాఖలో జవాబుదారీ, పారదర్శకంగా పని చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు సహా అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తామన్నారు.

పౌరసరఫరా శాఖలో 58 వేల కోట్ల రూపాయల అప్పులు పేరుకు పోయాయని, పేదలకు ఇస్తున్న బియ్యం కిలో 38 రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రజలకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. దీన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగ పడేలా చర్యలకు ఉపక్రమించామన్నారు. నెల రోజుల పాలన అత్యంత సంతృప్తిని ఇచ్చిందని, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖలో అత్యంత పారదర్శకంగా, జవాబు దారి తనంతో పని చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు.