తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి

తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి పనులు జరుపుతామని మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం మేడారం మహా జాతర అభివృద్ధిపై మంత్రులు సమీక్షించారు.

  • Publish Date - September 18, 2025 / 08:51 PM IST
  • పూజారుల అభిప్రాయాలకు పెద్దపీట
  • మరింత విశాలంగా మేడారం ప్రాంగణం
  • త్వరలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన
  • సమీక్ష సమావేశంలో ప్రకటించిన మంత్రులు పొంగులేటి , సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విధాత): తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి పనులు జరుపుతామని మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వెల్లడించారు. గురువారం మేడారం మహా జాతర అభివృద్ధిపై మంత్రులు సమీక్షించారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆదివాసి జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, పూజారుల అభిప్రాయాలు, ఆలోచనల మేరకు అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో సీఎం సెక్రెటరీ శ్రీనివాస రాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్, మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు, నిపుణులు పాల్గొన్నారు. మేడారం జాతర నిర్వహణ, ఆలయ అభివృద్ధికి సంబంధించి పూజారుల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, ఆదివాసి సంప్రదాయాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయని మంత్రులు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజైన్లు దాదాపు ఖరారు చేశారు. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి. సీఎం ఆమోదం తర్వాత ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రులు ప్రకటించారు.

ప్రస్తుతం మేడారం ఆలయ ప్రాంగణంలో ఒకేసారి సుమారు 7,000 మంది భక్తులు తల్లులను దర్శించుకునే సౌకర్యం ఉంది. అయితే విస్తరణ పనులు పూర్తయ్యాక, ఆ సామర్థ్యం 10,000 మందికి పైగా పెరగనుంది. ప్రాంగణం వెడల్పు, పొడవు పెరిగి మరింత విశాలంగా మారుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున వచ్చే భక్తులు సులభంగా, వేగంగా, క్రమపద్ధతిలో దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. సమ్మక్క, సారలమ్మలతో పాటు అదే వరుస క్రమంలో పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్పుతో భక్తులు ఇబ్బంది లేకుండా, సమయం వృథా కాకుండా ఒకే దారిలో, సాఫీగా తల్లులను దర్శించుకునే వీలు ఉంటుందన్నారు.

మేడారం ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించగానే ఆదివాసి ఆధ్యాత్మిక భావన కలిగేలా సాంప్రదాయ ఆర్చులు నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ రాతి పిల్లర్లు, వాటిపై ఆదివాసీ కళాత్మక ఆకృతులతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దన్నారు. తరతరాలు గుర్తుంచుకునేలా ఈ రాతి కట్టడాలు శాశ్వత చిహ్నాలుగా నిలిచిపోతాయన్నారు. అలాగే భక్తుల భద్రత దృష్ట్యా, మేడారం ప్రాంగణం చుట్టూ నాలుగు వాచ్ టవర్లు నిర్మించాలని భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే జాతర కాలంలో ఈ వాచ్ టవర్లు విజిలెన్స్, సెక్యూరిటీ, కంట్రోల్‌లో కీలకపాత్ర పోషించనున్నాయన్నారు.

మేడారం గుడి అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, త్వరలో సీఎం ఆమోదంతో పనులు ప్రారంభమవుతాయని మంత్రులు తెలిపారు. మేడారం అభివృద్ధి కేవలం సదుపాయాలు పెంపునకే పరిమితం కాకుండా, ఆదివాసీ సంస్కృతిని, విశ్వాసాన్ని, వారసత్వాన్ని మరింత బలంగా ప్రతిబింబించేలా రూపకల్పన జరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు. ప్రతిపాదిత అభివృద్ధి పనుల పట్ల సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఇతర పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. గడువులోపు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.