Site icon vidhaatha

Komatireddy | ఎమ్మెల్యే పదవి అనేది కిరీటం కాదు.. అది ఒక బాధ్యత: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నేను కొట్లాడేది ప్రజల కోసమే

విధాత, హైదరాబాద్ : ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి అనేది కిరీటం కాదని, అది ఒక బాధ్యతని, నేను కొట్లాడేది ప్రజల కోసమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం చౌటుప్పల్ వలిగొండ క్రాస్ రోడ్డు నుంచి నాగారం రోడ్డు వరకు 9.95 కోట్ల, వ్యయంతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చౌటుప్పల్‌లోని చిన్న కొండూరు రోడ్డులో అమృత్ పథకంలో భాగంగా త్రాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరుచుటకు 21 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణంలోని బీసీ కాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో మొక్కలను నాటి విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బీఆరెస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన తరుణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే అభివృద్ధిలో కూడా వెనకడుగు వేయకుండా ముందుకు పోతుందన్నారు. చౌటుప్పల్ పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా 18:30 లక్షల లీటర్ల త్రాగు నీటి సరఫరా వ్యవస్థను 24 లక్షల లీటర్లకు పెంచుతున్నామన్నారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించామంటూ అవాస్తవాలు ప్రచారం చేసుకుందన్నారు. రాబోయే కాలంలో ప్రతి ఇంటికి పైపులైన్ ద్వారా శుద్ధి చేసిన తాగునీటినందించే కార్యక్రమం చేపడుతామన్నారు. హైదరాబాద్ పట్టణానికి ఏమాత్రం తీసిపోని విధంగా చౌటుప్పల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు.

రాబోయే రోజుల్లో మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు తయారైతే లక్ష మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఆశించామో అంత మేరకు అభివృద్ధి జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిరుపేదలకు ఇండ్లు రాలేదని, తమ ప్రభుత్వం తొలి విడతలో నియోజకవర్గానికి 3500ఇళ్లను మంజూరీ చేయనుందన్నారు.నూతన రేషన్ కార్డులు జారీ చేయబోతుందన్నారు. ఇప్పటికే రైతురుణమాఫీ కొనసాగుతుందని, ఎన్నికల హామీ దిశగా ముందుకెలుతున్నామన్నారు. భద్రతతో కూడిన నాణ్య మైన కరెంటును అందించడానికి పోల్స్ మార్పిడితోపాటు సరిపడా పోల్స్ అందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు.

నారాయణపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు నేను తరగతి గదులు కట్టిస్తానని మీరు మంచిగా చదువుకొని జీవితంలో పైకి రావాలని విద్యార్థులకు సూచించారు. తాను ఎన్నికైన మరుసటి రోజు నుండే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని కఠినంగా ప్రయత్నిస్తున్నానని.. ఎక్కడైనా బెల్టు షాపుల ద్వారా మధ్య అమ్ముతున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండని, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉన్న పోలీస్ అధికారుల నెంబర్లు మహిళలకు అందించారు. ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టొద్దని ఈ విషయంలో ఎవరు చెప్పిన ఊరుకునే పరిస్థితి లేదని పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం అమ్మకాలపై అధైర్య పడకుండా ధైర్యంగా ఫోన్ చేసి చెప్పాలని నీకు నేను అండగా ఉంటానని మహిళలకు భరోసా ఇచ్చారు.

Exit mobile version