విద్యా రంగానికి ప్రాధ్యానం: ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు

  • Publish Date - June 12, 2024 / 05:11 PM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పాలమూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలని మంచి సంకల్పంతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్‌లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం నిశ్శబ్ద విప్లవమన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే మహిళా సంఘాల ద్వారా దుస్తులు కుట్టి విద్యార్థినీ, విద్యార్థులకు యూనిఫాం అందించడం పట్ల వారిని ఎమ్మెల్యే అభినందించారు. బడి ప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం,నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టడం అద్భుతమని కొనియాడారు.విద్యా రంగం లో రాష్ట్రం ప్రభుత్వం ద్వారా అద్భుతాలు జరగబోతున్నాయని అన్నారు.గత ప్రభుత్వం లో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యం చెందారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలపై దృష్టి పెట్టిందని,భవిష్యత్ తరాలు బాగుండాలని కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతున్నదన్నారు. ఉపాధ్యాయులు నూతన పద్ధతులతో విద్యార్థులకు పాఠ్య బోధన అందించాలన్నారు.

విద్యా రంగంలో రాష్ట్రంను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థులు విద్యా తో పాటు, క్రీడలలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలు ఉపయోగించుకొని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీ ప్రపంచంలో ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడే విద్య లో రానించవచ్చని,విద్య పై ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే విద్యార్థులకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి,మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు, పాల్గొన్నారు.

Latest News