న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీ(BJP MPs)ల పనితీరుపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిని మందలిస్తూ క్లాస్ తీసుకున్నారు. గురువారం ఢిల్లీలో ఏపీ(AP), తెలంగాణ(Telangana), అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంటపాటు ఆయన మాట్లాడారు. ఏపీలో బీజేపీ ఎంపీలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వ్యవహరించడం లేదని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ, జగన్ లు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారంటూ మందలించారు. సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని సూచించారు. ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం అని, చంద్రబాబు పనితీరుతో ఆ రాష్ట్రానికి మంచి పెట్టబడులు వస్తున్నాయని మోదీ తెలిపారు.
తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం
తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ అగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయని..వాటిని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని అసహనం వెలిబుచ్చారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారన్నారు. మంచి టీమ్ ను పెట్టుకుని సమర్ధంగా ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంలో సమస్య ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా కంటే, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియా బాగా పనిచేస్తుందని మోదీ తెలంగాణ ఎంపీలకు చురకలేశారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలు జాతీయ పరిణామాలపై కూగా సమగ్ర అవగాహానతో స్పందించాలని సూచించారు. పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మోదీ వారికి సూచించారు.
