- ఫిబ్రవరి 18 నుంచి బదిలీ అన్నారు
- పరిషత్ ఎన్నికల వాయిదాతో నిధుల బదలాయింపు ఆలస్యం
- భరోసా కోసమే రూ. 9వేల కోట్ల రుణం
విధాత, హైదరాబాద్ :
Rythu Bharosa | రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు లేకపోవడంతో రైతు భరోసా నగదు బదిలీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలని మొన్న జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఖజానాలో ఉన్న రైతు భరోసా నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలనే యోచనకు వచ్చారని సచివాలయంలోని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకున్న మెట్రో రైలుకు భరోసా నిధులు బదలాయించనున్నారని ఆ వర్గాల కథనం. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు.
మొన్న సంక్రాంతికి రావాల్సిన భరోసా
యాసంగి సీజన్ రైతు భరోసా నగదు జనవరిలో సంక్రాంతికే ఇవ్వాల్సి ఉంది. కానీ.. మున్సిపల్ ఎన్నికలు, నిధుల లభ్యత లేని కారణంగా వాయిదా పడింది. ఎన్నికల ఫలితాలు రాగానే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి నగదు బదిలీ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడ బహిరంగ సభలో ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకారంగానే నగదు బదిలీ చేస్తారని యావత్ రైతాంగం ఆశగా ఎదురు చూసింది. ఫిబ్రవరి 18వ తేదీన ఖాతాలలో నగదు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటన వెలువరిస్తారని లీకులు వచ్చినా… ఆ మంత్రి మండలి సమావేశానికి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరు కాలేదు. ఈ సమావేశంలో రైతు భరోసాపై కనీసం చర్చ కూడా జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏప్రిల్ నెలలో పరిషత్ ఎన్నికలు?
బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున, నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని మంత్రి మండలి సమావేశంలో చర్చించారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. అప్పటికీ నిర్ణయం తీసుకోనట్లయితే ఏప్రిల్ నెలలో పరిషత్ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేద్దామనే ఏకగ్రీవ నిర్ణయానికి మంత్రి మండలి వచ్చింది. మరో నెల లేదా రెండు నెలల వరకు పరిషత్ ఎన్నికలు లేనందున రైతు భరోసా కోసం అప్పు చేసిన రూ.9వేల కోట్లను ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో అధికారులు చర్చించుకుంటున్నారు.
మెట్రోకు వన్ టైమ్ సెటిల్మెంట్
మెట్రో రైలు కోసం ఎల్ అండ్ టీ… వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నది. ఎల్ అండ్ టీ సుమారు రూ.13వేల కోట్లు బకాయి పడింది. ఈ అప్పులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించి, వాయిదాల ప్రకారం చెల్లించుకొనే వెసులుబాటు ఉంది. ఈ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ తన ఈక్విటీ కింద రూ.3వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.2,100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎల్ అండ్ టీ యాజమాన్యం కూడా అంతే మొత్తం తీసుకునేందుకు సమ్మతించింది. మార్చి నెలాఖరులోగా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా మార్చాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. 23న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా మెట్రో రైలు స్వాధీనంపై ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వ ఆర్థిక శాఖ వద్ద అందుబాటులో ఉన్న నిధులపై ఆధారపడక తప్పలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతు భరోసా కోసం అప్పు చేసిన రూ.9వేల కోట్లలో రూ.2,100 కోట్లు ఎల్అండ్‌టీకి చెల్లించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నాయి. ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తయితే తప్ప మెట్రో రైలును స్వాధీనం చేసుకునే పరిస్థితులు లేవు.
మిగిలినవి ఇతర చెల్లింపులకు…
భరోసాకు చేసిన అప్పుల్లో రూ.2,100 కోట్లు మెట్రో రైలుకు పోను.. మిగిలిన నిధులను సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ప్రభుత్వం కీలక మంత్రిగా ఉన్న ఒకాయన తన స్వంత కాంట్రాక్టు కంపెనీకి రూ.2వేల కోట్ల వరకు చెల్లింపులు చేయించుకున్నారని ఆర్థిక శాఖలో చర్చ జరుగుతోంది. రైతు భరోసా ఇచ్చే సమయంలో మళ్లీ అప్పులు తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది. అప్పటి వరకు ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటారని తెలుస్తున్నది.
ఒకటి రెండు నెలలు ఆగాల్సిందేనా?
గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.8,744 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. ప్రారంభం రోజు ఒక ఎకరా నుంచి ప్రారంభించి మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ మొత్తాన్ని వారి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇదే తరహాలో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి వీరందరికీ ఈసారి కూడా బదిలీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. కాని పరిషత్ ఎన్నికలు వాయిదా వేయడంతో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర రైతాంగం నగదు సాయం ప్రకటన కోసం నెలా రెండు నెలల పాటు ఎదురు చూపులు తప్పకపోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.
Read Also |
Vijay – Rashmika Wedding | విజయ్, రష్మిక పెళ్లి ఫొటోస్.. వీటిలో ఇది గమనించారా?
Holi Festival | హోలీ రోజున ఐదు శక్తివంతమైన యోగాలు.. ఈ నాలుగు రాశుల వారికి దశ తిరిగినట్లే..!
Sleep | సరైన నిద్ర లేకుంటే గుండెకు నష్టమే..! తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!!
