ప్రధానిని ఎన్నుకునే ఎన్నికల్లో మోదీదే గెలుపు

దేశానికి ఎవరు ప్రధాని కావాలో... ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేందుకు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ప్రధానిగా మోదీనే కావాలని నిర్ణయించుకున్నారని, ఈ ఎన్నికల్లో మోదీ..బీజేపిదే గెలుపని కేంద్ర మంత్రి

  • Publish Date - April 21, 2024 / 03:08 PM IST

నమ్మకద్రోహ పార్టీ కాంగ్రెస్‌ను ఓడిస్తారు
రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ను జనం నమ్మరు
25న రాష్ట్రానికి అమిత్ షా..27న మోదీ రాక
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వెల్లడి

విధాత : దేశానికి ఎవరు ప్రధాని కావాలో… ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేందుకు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ప్రధానిగా మోదీనే కావాలని నిర్ణయించుకున్నారని, ఈ ఎన్నికల్లో మోదీ..బీజేపిదే గెలుపని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. యూసుఫ్ గూడ కృష్ణానగర్‌లో జైన్ మందిర్‌ను సందర్శించారు. అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ, శ్రీనగర్ నగర్ డివిజన్, హైలైన్ కాలనీ నుంచి కిషన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. మోదీ లేని భారతదేశాన్ని ఊహించలేమని, మోదీ నాయకత్వంలోనే మనం కొనసాగాలన్నారు. దేశంలోని అనేక సమస్యలను మోదీ పరిష్కరించారన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోసపూరితంగా వ్యవహారిస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో దూరం పెడుతారన్నారు. దేశంలో కాంగ్రెస్ గాని. ఇండియా కూటమిగాని గెలిచే అవకాశం లేనందునా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల గెలుపుతో ప్రయోజనం ఉండదన్నారు. అందుకే ప్రజలు తెలివిగా రాష్ట్రాభివృద్ధి, దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని బీజేపీని గెలిపిస్తారని నమ్ముతున్నామన్నారు. తెలంగాణలో దోచుకున్న కేసీఆర్ కుటుంబం పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసిన కూడా ప్రజలు నమ్మరని.. ఓట్లు పడవని స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల భూములు ఏ రకంగా కబ్జాలు చేశారో మనందరికీ తెలుసన్నారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతికి, ఫోన్ ట్యాపింగ్‌లతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలవబోతుందని, బీజేపీ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి 25వ తేదీన అమిత్ షా వస్తున్నారు, 26న జేపీ నడ్డా, 27న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వస్తారని, వరుసగా జాతీయ నేతల సభలు ఉంటాయని తెలిపారు. బహిరంగ సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు ఉంటాయని పేర్కోన్నారు.

Latest News