Suicide | ఇప్పటి వరకు అత్తల( Mother in Laws ) వేధింపులు భరించలేక కోడళ్లు( Daughter in Laws ) ఆత్మహత్య( Suicide ) చేసుకున్న ఘటనలు అనేకం చూశాం. కానీ ఇందుకు రివర్స్‌గా ఓ అత్త తన కోడలి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని బాపూజీ నగర్( Bapuji Nagar )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బాపూజీనగర్‌కు చెందిన ఎన్.సుశీల (44) కు కుమారుడు సదానంద్ ఉన్నాడు. అయితే సుశీల ఇండ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. కొంతకాలంగా కోడలు వరలక్ష్మి, అత్త సుశీలకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తను ఏ మాత్రం కోడలు లెక్క చేయకుండా దూషిస్తూ మానసికంగా వేధిస్తోంది.
అంతే కాకుండా అత్త సుశీలను కోడలు పిల్ల ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుశీల.. ఈ నెల 22న బాపూజీ నగర్ శ్మశాన వాటిక వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక సుశీల పెద్దగా అరిచింది. గమనించిన స్థానికులు మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు.
తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమెను పోలీసులు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి సుశీల ప్రాణాలు విడిచింది. కోడలి వేధింపులతో తాను ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.