విధాత, ప్రత్యేక ప్రతినిధి: పర్యాటకులు ఆశతో ఎక్కడికో వెళ్ళి నిరాశచెందే బదులు …… కాలుష్యకాసారాలుగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో గడిపే బదులు పచ్చని అందాల అడవిని దర్శించుకుని ఆనందంతో గడపేందుకు ములుగు జిల్లాలో మరో కొత్త ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చదిద్దారు. ములుగు జిల్లాలో ఈనెలలో మేడారం జాతర సందర్భంగా మేడారంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శనీయంగా మారుస్తున్నారు. జిల్లాలో తరిగిపోని గనిగా, వనరుగా ఉన్న అడవినే పర్యాటకంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాడ్వాయి మండలంలోని జలగలంచను తాజాగా సందర్శనీయ ప్రాంతంగా మార్చారు.
తాడ్వాయి మండలం పరిధిలోని జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పచ్చని అడవిని తనివితీరా చూసేందుకు వీలుగా వ్యూ పాయింట్ గా మార్చారు. ఈ పర్యాటక ప్రదేశం లో కుటుంబ సమేతంగా సరదాగా గడుపుతూ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుకుంటూ ఆరోగ్యవంతమైన పర్యటన చేసుకునే విధంగా ములుగు జిల్లా స్వాగతం పలుకుతుంది. తాజాగా ఈ పర్యాటక ప్రాంతాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఇప్పటికే ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, మేడారం, మల్లూరు లక్ష్మినర్సింహస్వామిదేవాలయం, నర్సింహాసాగర్, గణప సముద్రం, కోటగుళ్ళు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే బొగత జలపాతాన్ని ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.ఈ ప్రాంతాలను ఇతర అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తు వెళుతున్నారు. గత సంవత్సరం పస్రా తాడ్వాయి మద్యలో జలగలంచ వాగు వద్ద బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ప్రారంభించారు. రాత్రిపూట గడిపేవిధంగా తీర్చదిద్దారు. ఇటీవలే తాడ్వాయి హట్స్ వద్ద సఫారీని కూడా అడవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తాజాగా జలగలంచ వద్ద అడవి అందాలు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రాంతాలకు దీటుగా మన అడవి అందాలు ఉంటాయని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే వారు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడపడానికి ములుగు జిల్లా ప్రకృతి అందాలను చూసేందుకు వీలు ఏర్పడుతోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Pawan Kalyan | మార్షల్ ఆర్ట్స్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించిన పవన్ కళ్యాణ్.. దాని వెనక కథ ఏంటంటే..!
Donald Trump : వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అంటూ ట్రంప్ సంచలన ప్రకటన
