విధాత, వరంగల్ ప్రతినిధి : రామప్ప, లక్నవరం ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేసి రాష్ట్రంలో ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ఇంచెర్ల గ్రామంలో రూ.37 కోట్లతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్ డెవలప్‌మెంట్ పనులను మంత్రి సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నానని, పర్యాటకులను ఆకర్షించే విధంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. యూనిస్కో గుర్తింపు పొందిన రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క సారలమ్మ, బోగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాలలో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఇప్పటికే పలు పనులను పూర్తి చేశామన్నారు. మిగతా పనులను త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లాను పర్యటక హబ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
లక్నవరంలో మరో రెండు ఐలాండ్ పనులను చేపట్టడమే కాకుండా పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులను తీసుకొచ్చామన్నారు. ఈ సంవత్సరం జనవరిలో జరగనున్న మేడారం మహా జాతర సందర్భంగా శ్వాశత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించిందని, ఈ పనులను త్వరలోనే చేపడుతామన్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజులలో ములుగు జిల్లా పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, టూరిజం శాఖ అధికారి శివాజీ, తదితరులు పాల్గొన్నారు.