నిరంతరం పని ఉండేలా కొత్త విధానం
కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
అన్ని ప్రభుత్వ ఆర్డర్లు టెస్క్ ద్వారా సరఫరా
బతుకమ్మ చీరలకు నిధులివ్వని గత ప్రభుత్వం
గత నవంబర్ నాటికే రూ.488 కోట్ల బకాయిలు
హైదరాబాద్ : నేత కార్మికుల స్వయం సమృద్ధికి ‘నేతన్న భరోసా’ అనే కొత్త విధానాన్ని రూపకల్పన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలికంగా లబ్ధి చేకూర్చే పథకాల రూపకల్పనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్ లూమ్ క్లస్టర్ల అభివృద్ధి, మైక్రో హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, నేషనల్ సెంటర్ ఫర్ డిజైన్స్ ఏర్పాటు, స్టేట్ టెక్నికల్ టెక్స్‌టైల్ పాలసీ తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలను అనుసంధానం చేయటంతో పాటు రావాల్సిన బకాయిలను తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో బతుకమ్మ చీరల పథకాన్ని వ్యాపారంగా మార్చిందనే విమర్శలు ఉన్నాయి. నవంబర్ 2023 వరకు సుమారుగా 488.38 కోట్లు వస్త్రాలకు సంబంధించి టెస్కోకు బకాయి పడింది. గత ఏడాది అక్టోబర్‌లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.351.52 కోట్లు బకాయిలు పెట్టిందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. కొత్త ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లోనే సమగ్ర శిక్షా అభయాన్ యూనిఫామ్‌ల సరఫరాకు సుమారు రూ.47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించిందని, నూలు కొనుగోలు, సైజింగ్‌కు నిధులు విడుదల చేసిందని తెలిపాయి. నూలు కొనుగోలుకు సంబంధిత మాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లు, సైజింగ్ యూనిట్లు అడ్వాన్సులు చెల్లించిందని చెప్పాయి.
గత ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను విస్మరించి మాక్స్ సహకార సంఘాలను ప్రోత్సహించడంతో అసలైన కార్మికులకు లబ్ధి చేకూరలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యాపారులు, దళారుల జోక్యం మితిమీరింది. రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాలు ఉంటే.. కేవలం 105 చేనేత సహకార సంఘాలకు మాత్రమే పని కల్పించగలిగిందని చేనేత వర్గాలు చెబుతున్నాయి.
కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలకు పని కల్పించే చర్యలు చేపట్టిందని, అదే సంకల్పంతో ఇప్పటికే దాదాపు రూ. 53 కోట్ల విలువైన వస్త్రాలు కొనుగోలు చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్‌లో ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 11న జీవో నం.1 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం టెస్కోలో లభ్యం కాని వస్త్రాలు కూడా నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇస్తే తప్ప ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ప్రసక్తి ఉండదని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు వస్త్రాల సరఫరాకు టెస్కోకు రూ.255.27 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయి. రాష్ట్రంలో 140 మాక్స్ సొసైటీలు, 135 ఎస్ఎస్ఐ యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి గతంలో చేసిన కొనుగోళ్లు, చెల్లించిన బిల్లులు, వాటి విద్యుత్తు వాడకం పరిశీలిస్తే.. సుమారు ౩౦ శాతం బోగస్ సొసైటీలు ఉన్నట్టుగా ఇటీవలే ప్రాథమిక విచారణలో బయటపడింది.