Site icon vidhaatha

New White Ration cards । వచ్చేస్తున్నాయి.. కొత్త తెల్ల రేషన్‌ కార్డులు! అసెంబ్లీలో అప్‌డేట్‌ ఇచ్చిన మంత్రి ఉత్తమ్‌

New White Ration cards ।  కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. దీనికి కుల గణన సర్వేను ఆధారంగా చేసుకోనున్నట్టు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో కోదండరెడ్డి, మీర్జా రియాజుల్ హసన్ ఏఫెండి లతో పాటు జీవన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ ప్రభుత్వ అంచనా ప్రకారం కొత్తగా పది లక్షల కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని వివరించారు. తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 956 కోట్ల భారం పడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చెయ్యబోతున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులలో అదనపు పేర్ల నమోదుకు గాను మీ సేవ కేంద్రం ద్వారా గడిచిన పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను చేబడతామన్నారు. అంతే గాకుండా కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలతో పాటు తాండా లలో కుడా కొత్త చౌక ధరల దుకాణాల ఏర్పాటు ఉంటుందన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలెవ్వరు వినియోగించక పోవడంతో దారి మళ్లు తున్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అందుకనే తెల్ల రేషన్ కార్డు దారులందరికి ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సంక్రాంతి తర్వాత కొత్త తెల్లరేషన్‌ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఈ రోజున రాష్ట్రంలో మొత్తం 89.95 లక్షల తెల్ల రేషన్ కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జాతీయ ఆహారభద్రత కింద కేంద్రం 54 లక్షల కార్డులు అందించగా కోటి 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 35 లక్షల ఆహార భద్రతా కార్డులతో 89 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారని ఆయన సభకు వివరించారు.

ఇవి కూడా చదవండి..

TG Family Digital Card | తెలంగాణ ఫ్యామిలీ డిజిట‌ల్ కార్డు ద‌ర‌ఖాస్తు.. ఈ నాలుగు ధృవ‌ప‌త్రాలు త‌ప్ప‌కుండా జ‌త ప‌ర‌చాల్సిందే..!

Exit mobile version