విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మిరుదొడ్డి మండలం సూరంపల్లిలో ప్రచారానికి వచ్చిన దుబ్బాక నియోజకవర్గ బీ అర్ఎస్ అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి మీడియా ప్రతినిధి అంటూ పరిచయం చేసుకుంటూ వెంట తెచ్చుకున్న కత్తితో ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు. ఘటనలో ఎంపీకి కడుపు కత్తి పోటు గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని అక్కడే ఉన్న కార్యకర్తలు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. యుట్యూబ్ చానల్ పేరుతో నిందితుడు చలామణి అవుతున్నట్లు తెలిసింది. అతని వద్ద కాంగ్రెస్ పార్టీ కండువాలు ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. నిందితుడు చెప్యాల గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం.
గజ్వేల్ ఆసుపత్రికి ఎంపీ తరలింపు
కత్తి దాడిలో గాయపడిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని వెంటనే ఆయన అనుచరులో వాహనంలో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.