Site icon vidhaatha

Rahul Gandhi | నిర్మలమ్మ పద్దు.. ‘కుర్సీ బచావో’ బడ్జెట్‌: రాహుల్‌ గాంధీ విమర్శలు

న్యూఢిల్లీ : బీజేపీ తన మిత్రపక్షాలు, తన ఆశ్రిత పెట్టుబడిదారులను మెప్పించేందుకే బడ్జెట్‌ను రూపొందించిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. బడ్జెట్‌ పత్రాలను ఆయన ‘కుర్సీ బచావో’ బడ్జెట్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను కాపీకొట్టారని విమర్శించారు. ‘కుర్సీ బచావో బడ్జెట్‌. మిత్రపక్షాల బుజ్జగింపు: ఇతర రాష్ట్రాలను పణంగా పెట్టి.. వాటికి హామీల కుమ్మరింపు. ఆశ్రితపెట్టుబడిదారుల బుజ్జగింపు: సాధారణ భారతీయుడికి ఎలాంటి ఉపశమనాలు లేవు కానీ.. ఏఏకు లబ్ధి. కాపీ పేస్ట్‌: కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో, గత బడ్జెట్లు’ అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో స్పందించారు.

ఇతర కాంగ్రెస్‌ నాయకులు సైతం ఇది కాపీ బడ్జెట్‌ అని అభివర్ణించారు. తమ మ్యానిఫెస్టోలోని అంశాలను కాపీ కొట్టడంపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ‘ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి చదివారని తెలిసి చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో పొందుపర్చిన ఉపాధి ఆధారిత ఇన్సెంటివ్ పథకాన్ని ఆమె స్పష్టంగా అందిపుచ్చుకున్నందుకు ఆనందంగా ఉంది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని 11వ పేజీలో పేర్కొన్న విధంగా అలవెన్స్‌తోపాటు అప్రెంటిస్‌షిప్‌ కల్పించే పథకాన్ని ఆమె ప్రవేశపెట్టినందుకు ఆనందంగా ఉన్నది. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలోని మరికొన్ని అంశాలను ఆమె కాపీ చేసి ఉండాల్సింది. తప్పిపోయిన అవకాశాలను త్వరలోనే పేర్కొంటాను’ అని చిదంబరం ఎక్స్‌లో పేర్కొన్నారు.

Exit mobile version