అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచన
విధాత : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్ తమిళసై ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా కూడా రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో చైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికల హామీ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ దిశగా ముందుగా టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనకు చర్యలు చేపట్టారు.
బోర్డు సభ్యులు, చైర్మన్‌లతో రాజీనామాలు చేయించడంతో పాటు గవర్నర్‌తో ఆమోదం తీసుకున్నారు. అటు ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి టీఎస్‌పీఎస్సీ పునర్ వ్యవస్థీకరణకు సలహాలు, సూచనలు తీసుకున్నారు. విద్యాశాఖ సమీక్షలో మెగా డీఎస్సీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల లోగానే 22వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో నిరుద్యోగుల ఆశలు నేరవేర్చే దిశగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు టీఎస్‌పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి రేవంత్‌రెడ్డి వేగంగా చర్యలు తీసుకోగా, నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.