న్యూట్రిషన్ కిట్లు గర్భిణీలకు వరం: మంత్రి హరీష్

విధాత, నిజామాబాదు: న్యూట్రిషన్ కిట్స్ గర్భిణీ స్త్రీలకు వరం లాంటిదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో వర్చువల్ పద్ధ‌తిన కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుండి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, […]

  • Publish Date - December 21, 2022 / 04:47 PM IST

విధాత, నిజామాబాదు: న్యూట్రిషన్ కిట్స్ గర్భిణీ స్త్రీలకు వరం లాంటిదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో వర్చువల్ పద్ధ‌తిన కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుండి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు వారి వెంట ఉన్నారు.

ఆదిలాబాద్‌ లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌, భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్‌, జయశంకర్‌ భూపాలపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వికారాబాద్ జిల్లాలో మంత్రి సబిత ఇంద్రారెడ్డి, నాగర్‌ కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, గద్వాల్‌లో మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆయా జిల్లాల నుంచి పాల్గొని ప్రసంగించారు. అనంతరం గర్భిణులకు కిట్స్ పంపిణీ చేశారు. ఇదే వేడుకగా ఏఎన్ఎం లకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్‌ కిట్, ప్రసవం తర్వాత కేసీఆర్‌ కిట్‌ లు అందజేస్తున్నామని చెప్పారు. 9 జిల్లాల్లో కిట్స్ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.

తమవి న్యూట్రిషన్ పాలిటిక్స్ అని, ప్రతిపక్షం వారివి పార్టీషన్ పాలిటిక్స్ అని ఏద్దేవా చేశారు. పథకాల రూపకల్పనలో ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభిస్తారన్నారు. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తమ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టిందని, రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ సూపర్‌ హిట్‌ అయిందన్నారు.

9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం వీటిని పంపిణీ చేస్తుంద‌న్నారు. ఈ న్యూట్రీషన్‌ కిట్లలో కిలో న్యూట్రీష‌న్ మిక్స్ పౌడ‌ర్, కిలో ఖ‌ర్జూరం, మూడు ఐర‌న్ సిర‌ప్ బాటిల్స్‌, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ వుంటాయన్నారు.

ఈనెలలో విడుదలైన కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో మాతృ మరణాల రేటు 2014లో 92 ఉండగా, ప్రస్తుతానికి 43కు తగ్గిందని, మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. ముందు ముందు ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు గాను కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్స్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇది గొప్ప మార్పునకు నాంది పలుకనున్నట్లు చెప్పారు.
సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి భూమి పూజ

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో బుధవారం 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం భూమి పూజ చేశారు. మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించారు.

పనులను త్వరితగతిన చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.