NVSS Prabhakar | రుణమాఫీ హామీతో సీఎం రేవంత్‌రెడ్డి మోసం

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ రైతులను మభ్య పెట్టి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు

  • Publish Date - May 16, 2024 / 05:07 PM IST

బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌
అమలుపై స్పష్టత నివ్వాలని డిమాండ్‌

విధాత, హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లోనూ రైతులను మభ్య పెట్టి రేవంత్ రెడ్డి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు సమస్యలను పూర్తిగా నిర్లక్షం చేస్తున్నారని, రైతు హామీల అమలులో మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నాడని విమర్శించారు. పంట బోనస్ 500సంగతేమోగాని రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు రైతు రుణ మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నాడని, అప్పులు తెచ్చి రుణ మాఫీ చేయడం కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం మించి రుణాలు తీసుకుందని, ఈ పరిస్థితుల్లో రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు. రైతు రుణ మాఫీపై కార్యచరణ ఎంటో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ భీమా నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కరెంట్ కోతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సబ్ స్టేషన్లను సందర్శించాలన్నారు.

కరవు, అకాల వర్షాలతో రైతులు అనేక రకాలుగా పంటనష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర సమస్యలపై వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ సరళీలో కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్య బంధం ఎన్నికల్లో బయటపడిందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారని, ఇప్పుడు బీజేపీ గెలుపు అడ్డుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

Latest News