ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి.. ప్రభుత్వానికి ఔట్‌సోర్సింగ్ జేఏసీ విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది.

విధాత, హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం ఈరోజు జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల కోసం ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయం అని తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ వెల్లడించింది. కానీ అదే సమయంలో పదేళ్ల నుంచి పదిహేనేళ్ల వరకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయి పనితో సేవ చేస్తున్న ఐదు లక్షలు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వ దఫ్తరులలో వెన్నుముకలా పనిచేస్తున్న లక్షలాది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై జేఏసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సేవలందిస్తూనే మరణించిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డుపై సంవత్సరాల తరబడి ప్రభుత్వంలో పనిచేసి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కూడా సహాయం లేదు. ఏజెన్సీ నుంచి కూడా ఒక్క రూపాయి రావడం లేదని.. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇది ఏ రకమైన సామాజిక న్యాయం? ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ వంటి శాఖల్లో 10 ఏళ్లు పైగా పనిచేసిన వారిని “మీకు ఉద్యోగ భద్రత లేదు” అంటూ ఒక్కసారిగా బయటకు పంపేశారని, ఆ కుటుంబాల పరిస్థితి ఎవరు చూసుకుంటారు? అని జేఏసీ ప్రశ్నించింది. సర్వీస్‌లో ఉండగానే మరణించినా లేదా రిటైర్ అయినా ఏ బెనిఫిట్ లేదు. సర్కారీ పనులు చేస్తూ జీవితాన్ని అర్పించినా.. పెన్షన్, గ్రాట్యుటీ, భద్రతా పథకాలు లేవు అని ఆవేదన వ్యక్తం చేసింది. ESI & EPF కట్టకపోవడం వల్ల ఆరోగ్య భద్రత లేకుండా అప్పుల బాట పడుతున్నారు.

ప్రభుత్వంలో పనిచేస్తున్న 3 నెలలు, 7 నెలలు, 16 నెలలు పాటు వేతనాల చెల్లింపులో ఆలస్యంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
భూ భారతికి సంబందించి 16 నెలలు, బీసీ వెల్ఫేర్ 7 నెలలు, ల్యాండ్ అక్విజిషన్ 9 నెలలు, మరిన్ని శాఖల్లో 3–5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. వేతనాలు రాకపోవడంత ఇండ్ల కిరాయిలు, పిల్లల ఫీజులు, లోన్లు చెల్లించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఏజెన్సీలు ఉద్యోగం పేరుతో 2–3 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఉద్యోగుల PF/ESI డబ్బులు కాజేసి.. ప్రభుత్వంతో కుమ్మక్కై కోట్ల రూపాయలు దోచుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదు? అని జేఏసీ ప్రశ్నిస్తోంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీమ్ కోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతనం అందడం లేదు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే :

1.ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దుచేయాలి. ఏజెన్సీల దోపిడీని ఆపేందుకు ప్రభుత్వం స్వంతంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
2.ఆరోగ్య భద్రత – ESI, EPF ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి
3. సమాన పనికి సమాన వేతనం – కోర్టు తీర్పు వెంటనే అమలు చేయాలి
4.మరణించిన/రిటైర్ అయిన ఉద్యోగుల కుటుంబాలకు భద్రతా పథకాలు ఇవ్వాలి
5.వేతనాలు ఆలస్యం కాకుండా నెలనెలా చెల్లింపు వ్యవస్థ అమలు చేయాలి
6.ఏజెన్సీల అవినీతి విచారణ చేసి లైసెన్సులు రద్దు చేయాలి.
7.గిగ్ వర్కర్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారిని గౌరవించింది. అదే గౌరవాన్ని ప్రభుత్వానికి వెన్నుముక అయిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇవ్వాలి. అని ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ జేఏసీ కమిటీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ రాజమ్మద్, రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.

Latest News