విధాత: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసినట్లు పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ గురువారం నాడు విచారణకు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 9 అమలుపై తెలంగాణ హైకోర్టు స్టేని ఎత్తివేయాలని పిటిషన్ లో కోరామని, 50 శాతం రిజర్వేషన్లకు మించకుండా పాత పద్దతిలో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పిన దాని పైన కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశాం అని తెలిపారు.
40 పేజీలతో స్పెషల్ లీవ్ పిటీషన్ ని దాఖలు చేశాం అని..అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన కుల గణన కమిషన్ ఏర్పాటు సహా అన్ని వివరాలను వివరంగా పిటీషన్ లో పొందుపరిచామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు అమలుతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తమ ప్రభుత్వం కృతనిచ్చేయంతో ఉందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతిచ్చాయని, ఇప్పుడు మాట మారుస్తున్నాయని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.