– నెల రోజులైనా హామీల అమలులో కాలయాపన
– సమయమంతా ఢిల్లీ పర్యటనలకే
– పాత పథకాలు రద్దు.. కొత్త స్కీంల ఊసేలేదు
– నెల రోజుల కాంగ్రెస్ పాలనపై
బీఆరెస్ నేతలు పోచారం, పాటిల్ విమర్శలు
విధాత: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా హామీల అమలులో కాలయాపన చేస్తోందని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనల పేరిట విలువైన సమయం వృథా చేస్తున్నారని అన్నారు. పాత పథకాలు రద్దు చేయడం తప్ప కొత్త స్కీంల అమలు ఊసు లేదన్నారు. గృహలక్ష్మి పథకం రద్దు చేశారని, ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గృహలక్ష్మి లబ్ధిదారులను ఇందిరమ్మ పథకం కిందకు చేర్చి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం తప్ప.. మరే హామీ అమలు కావడం లేదని అన్నారు. రైతు బంధు ఇంకా ఎవరికీ సరిగా అందలేదని, రైతు రుణమాఫీ ఊసే లేదన్నారు. వడ్లకు బోనస్ ఏదంటూ నిలదీశారు.
యూరియా కొరత మొదలైంది..
గెలిచినా ఓడినా మాది ప్రజా పక్షమే అని పోచారం, పాటిల్ అన్నారు. మేం ప్రజల పక్షాన తప్పకుండా ప్రశ్నిస్తామని, ఇలాంటి దగా చేసిన ప్రభుత్వాన్ని ఎపుడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో మళ్ళీ యూరియా కొరత మొదలైందన్నారు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా బస్తాలు తీసుకునే పాలన వచ్చిందని, పోలీస్ స్టేషన్ లో యూరియా బస్తాలు ఇచ్చే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో లో పెట్టారని, అయితే భట్టి అసెంబ్లీలో.. మేమెక్కడ చెప్పామని కప్పి పుచ్చుకుంటున్నారని అన్నారు. దీర్ఘ కాలిక హామీలపై మేం అడగడం లేదని, తక్షణం పరిష్కరించాల్సిన సమస్యల గురించే మాట్లాడుతున్నామని అన్నారు. మాటలు చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలని, ప్రజలను మోసం చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లలో భారీగా అవినీతి జరిగిందని, చాలామంది జైలు పాలయ్యారన్నారు.
దరఖాస్తుల పేరిట ప్రజలకు ఇబ్బందులు
ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయని, దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెట్టారని పోచారం, పాటిల్ అన్నారు. చేయూత, రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేదంటూనే దరఖాస్తులు తీసుకోవడంలో ఆంతర్యమేంటన్నారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని విమర్శించారు. మొత్తానికి ప్రజల మోచేతికి బెల్లం పెట్టి దాట వేసే వైఖరితో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేదాకా కాలయాపన చేసి, ఏడాది దాకా హామీలను ఎగ్గొట్టే ప్రక్రియ నడుస్తోందన్నారు. తక్షణమే హామీలపై దృష్టి పెట్టాలని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.