హైదరాబాద్ : గత ఆరు నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. గత ఏడు నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నాను. ఆ తర్వాతనే రేవంత్‌ను మా ఇంటికి స్వాగతించాను. రైతు సంక్షేమం కోసం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలు ఆమోదయోగ్యమైనవి. రైతు బిడ్డను కాబట్టి.. వ్యవసాయంతో ఉన్నటువంటి అనుబంధం తెలుసు కాబట్టి వారు తీసుకుంటున్న నిర్ణయాలకు అండగా ఉండాలని, రైతులు బాగుపడాలని, వారి కష్టాలు తీరాలని ఉద్దేశంతో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను.
గత ఆరు మాసాల నుంచి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. కొన్ని సమస్యలు వస్తాయి.. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారి కేబినెట్‌ను అభినందిస్తున్నాను. నా జీవితంలో రాజకీయంగా ఆశించేది ఏం లేదు. రైతులతో పాటు వ్యవసాయం బాగుండాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రగతిలో చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అని పోచారం తెలిపారు.
చివరగా కాంగ్రెస్ పార్టీలోకే..
కేబినెట్ సహకారంతో రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటాను. రాష్ట్ర భవిష్యత్ కోసం పని చేస్తాను. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్‌లో చేరాను. కాంగ్రెస్ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ చివరగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్ కార్యక్రమాలు నచ్చి వారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస పార్టీలో చేరాను. రైతుల సంక్షేమాన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను. రేవంత్‌ను భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.