బీఆరెఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ .. హనుమకొండ బీఆరెస్‌ ఆఫీస్ నిర్మాణ కిరికిరి

అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన హనుమకొండ బీఆర్‌ఎస్‌ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు అనుమతి కిరికిరి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు

  • Publish Date - July 2, 2024 / 03:12 PM IST

విధాత ప్రత్యేక ప్రతినిధి:అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన హనుమకొండ బీఆర్‌ఎస్‌ ఆఫీస్ చుట్టూ ఇప్పుడు అనుమతి కిరికిరి నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు బీఆరెఎస్ ఆఫీసు నిర్మాణంపై సంబంధిత బాధ్యులకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఆఫీసు భూమి కేటాయింపు, నిర్మాణ అనుమతి పత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు తెలియజేయాలంటూ కార్పొరేషన్ అధికారులు నోటీసు జారీ చేశారు.

వరంగల్ కార్పొరేషన్ అధికారుల నోటీసు

హనుమకొండ బీఆర్‌ఎస్‌ భవనానికి అనుమతి లేదంటూ మంగళవారం ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడికి నోటీసులను జారీ చేశారు. హనుమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు బీఆరెఎస్‌ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. కాజీపేట మున్సిపల్ సర్కిల్‌ కార్యాలయం నుంచి ఈ/285476/జీడబ్ల్యూఎంసీ/ఏసీపీ-3/వార్డు నెంబరు 30/2024 లేఖను 25 జూన్‌ రోజున అందించారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లో తీసుకున్న అనుమతి పత్రాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో కొరారు.ఇదే విషయం గతంలో రెండు పర్యాయాలు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ బీఆరెఎస్ నాయకులు ఎవరు తీసుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు విషయాన్ని సీరియస్ గా పరిగణించి తాజాగా నోటీసులు జారీ చేసినట్టు భావిస్తున్నారు.

రాష్ట్రంలో అధికారం మారడంతో

హనుమకొండ జిల్లా పార్టీ ఆఫీసు నిర్మించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి గతంలో బీఆరెఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నాయిని రాజేందర్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కనే బీఆరెఎస్ జిల్లా ఆఫీసు నిర్మించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడంతో ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నివసిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కనే బీఆరెఎస్ జిల్లా కార్యాలయం ఉండడం ఇప్పుడు ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారింది. గతంలో ఒకే పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదు. అజాగా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పక్కన బీఆరెఎస్ కార్యాలయం ఉండడం ఇబ్బందిగా మారింది. దీంతో పాటు పార్కు స్థలంలో కార్యాలయం నిర్మించారని నూతన ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం ఇప్పుడు తాజా పరిణామంగా చెబుతున్నారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా నిర్మించిన బీఆరెఎస్ కార్యాలయాన్ని తొలగించేందుకు ఎమ్మెల్యే పట్టుపడుతున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు. దీనిపై తాజాగా అధికారులు స్పందించి నోటీసు జారీ చేయడంతో కథ మలుపు తిరిగింది. నోటీసుల పై బీఆరెఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కార్యాలయ నిర్మాణ అనుమతులు, అధికారిక పత్రాలు చూపెట్టకుంటే కార్పొరేషన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 ఆంధ్రప్రదేశ్ తరహా రాజకీయం?

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో నిర్మించిన వైసీపీ కార్యాలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేతలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో తెలంగాణలో సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై దాడికి దిగబోతున్నదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా బీఆరెఎస్ భవనం అక్రమం అంటూ ఆ భవనాన్ని కూల్చివేయాలంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా హనుమకొండ బీఆరెఎస్ కార్యాలయం పై కూడా స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో అధికారులు ముందుకు కదిలారు. బీఆరెస్‌ పార్టీ కార్యాలయం కూడా అక్రమం, అనుమతి లేకుండా నిర్మించారని వాదన తెర మీదకు వస్తే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోననే చర్చ సాగుతోంది.

Latest News