* అందరూ సహకరించాలన్న హైకోర్టు
* దుర్గం చెరువు పరిరక్షణపై త్రిసభ్య కమిటీ
* 6 వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశం
* తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా
విధాత, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు పరిరక్షణకు ముగ్గురు సభ్యులతో హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్‌లోని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అతుల్ నారాయణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శులను కమిటీ సభ్యులుగా నియమించింది. చెరువును పరిశీలించి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కమిటీని విజ్ఞప్తి చేసింది. 6 వారాల్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. కమిటీకి పోలీసులు పూర్తిగా సహకరించాలని, అలాగే వీరి రవాణా ఖర్చులతో సహా అన్ని ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కమిటీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దుర్గం చెరువు కలుషితం కారణంగా వందలాది చేపలు మృతిచెంది ఒడ్డుకు చేరుతున్నాయని, శ్వాస అందకనే అవి చనిపోతున్నాయని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణగా స్వీకరించింది. దీనిపై గత వారం విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం.. చెరువు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని అడ్వొకేట్ కమిషనర్‌గా న్యాయవాది వేదుల శ్రీనివాస్‌ను నియమించిన విషయం తెలిసిందే.
శుక్రవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన అడ్వొకేట్ కమిషనర్ పర్యావరణవేత్తగా నాగ్‌పూర్‌లోని ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ కు చెందిన అతుల్‌ను సూచించారు. దీంతో ధర్మాసనం.. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యం లేని చెరువును భావితరాలకు అందించాలన్నదే తమ సంకల్పమని, దీనికి అందరూ సహకరించాలని చెబుతూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.