పొంగులేటి, కొండా సురేఖకు తొలి పరీక్ష

పార్లమెంట్‌ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణకు తొలి అడుగువేసింది. శాసనసభ ఎన్నికల విజయంతో మంచి ఊపులో ఉన్న పార్టీ లోక్‌సభ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతోంది

  • Publish Date - December 19, 2023 / 02:22 PM IST

– ఎంపీ సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ

– మూడు స్థానాల్లో సానుకూల అంశాలు

– వరంగల్, ఖమ్మం ఎంపీ స్థానాలపై దృష్టి

– మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణకు తొలి అడుగువేసింది. శాసనసభ ఎన్నికల విజయంతో మంచి ఊపులో ఉన్న పార్టీ లోక్‌సభ ఎన్నికల పోరుకు సమాయత్తమవుతోంది. సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ ఎన్నికలు లక్ష్యంగా జరిగిన కసరత్తులో వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జిలుగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించింది. ఇక జనగామ లోక్ సభ నియోజకవర్గానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇన్చార్జిగా నియమించింది.

ఆ ఇద్దరి మంత్రులకు అగ్ని పరీక్ష

ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలకు ఎంపీ ఎన్నికలు అగ్నిపరీక్షగా చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లా పరిధిలోని మూడు ఎంపీ సీట్లను గెలుచుకోవడం అంత సులువైన విషయం కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఖమ్మం ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది. ఖమ్మం ఎంపీ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడా పొంగులేటికి మంచి సంబంధాలు ఉన్న మాట వాస్తవం. ఈ సంబంధ బాంధవ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి సంబంధాలు పొంగులేటికి లేకపోవడం కొంత ఇబ్బందికరమైన విషయం.


డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లతో పొంగులేటికి కొంత పరిచయాలు ఉన్నాయి. ములుగు, నర్సంపేట నియోజకవర్గంలో పెద్దగా సంబంధాలు లేవు. ఇక దొంతి మాధవ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పే సీనియర్ కాంగ్రెస్ నేత రామ సహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా పొంగులేటికి అందించే అవకాశం ఉంది. మిగిలిన ములుగు నియోజకవర్గంలో సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నందున సహజంగానే ఆమె సహకారం ఉంటుందని భావిస్తున్నారు. ఒక్క భద్రాచలం మినహా ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ అంశాల నేపథ్యంలో ఖమ్మం, మానుకోట నియోజకవర్గాలపై కాంగ్రెస్ పట్టు బిగించడం అనుకూల అంశాలుగా ఉన్నాయి.

వరంగల్లో సమన్వయం ప్రధానం

ఇక వరంగల్ లోక్ సభ నియోజకవర్గ బాధ్యతలు కొండా సురేఖకు అప్పగించినప్పటికీ ఇక్కడ పట్టు బిగించడం అంత ఈజీ కాదు అనే చర్చ సాగుతోంది. గతంలో హనుమకొండ లోక్ సభ నియోజకవర్గం ఉన్నప్పుడు అక్కడి నుంచి కొండా సురేఖకు పోటీ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్పులు జరిగాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్టేషన ఘన్‌పూర్ మినహా మిగిలిన సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి, కొండా సురేఖ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా తొలిసారి గెలుపొందిన వారు కావడం గమనార్హం. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి పట్టు సాధించి ఎంపీ సీటు గెలుపొందడం పరీక్షగా మారనుంది. సమన్వయంతో వీరందరినీ ఏకతాటి పైకి తీసుకురావడం కొండా సురేఖకు పరీక్షగా చెప్పవచ్చు. ఇలాఉండగా మరో ఇద్దరు మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌బాబు, సీతక్క ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్ సభ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, వారి ఇరువురు సైతం వరంగల్‌, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో ప్రధాన భూమిక పోషించనున్నారు. ఏమైనప్పటికీ ఖమ్మం మహబూబాబాద్, వరంగల్‌ స్థానాలు గెలువడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ఇతర పార్టీలు కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా సెటింగ్ ఎంపీలుగా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ ఎంపీగా పసునూరి దయాకర్ రెండు పర్యాయాలు ఎంపీగా కొనసాగుతున్నారు.

అభ్యర్థుల ఎంపిక ఆషామాషి కాదు

ఏదిఏమైనప్పటికీ ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో గెలుపు గుర్రాల ఎంపిక ఆషామాషీ కాదు. మంత్రుల్ని ఇన్చార్జిలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటే ప్రత్యర్థి పార్టీలు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అనుకూల వాతావరణాన్ని తగ్గించకుండా సరైన అభ్యర్థుల ఎంపికను కొనసాగించాల్సిన అవసరం ఉంది. సమన్వయంతో పావులు కదపాల్సిన సందర్భం ఈ ఇద్దరి మంత్రులపై ఉంది.