కోట్ల విలువ చేసే వాచ్‌ల స్మగ్లింగ్‌ కేసులో పొంగులేటి తనయుడు

కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన చేతిగడియారాలను స్మగుల్‌ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు

  • Publish Date - April 7, 2024 / 08:32 AM IST

నోటీసులు జారీ చేసిన చెన్నై కస్టమ్స్‌ అధికారులు

తనకేమీ సంబంధం లేదంటున్న హర్షరెడ్డి

వాచ్‌ల విలువ 1.73 కోట్ల రూపాయలు

సింగపూర్‌ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద స్వాధీనం

దర్యాప్తులో నవీన్‌ కుమార్‌ అనే డీలర్‌ అరెస్ట్‌

హవాలా మార్గంలో క్రిప్టోలో చెల్లింపులు

హర్షకు, ముబీన్‌కు మధ్యవర్తినన్న నవీన్‌

దాని ఆధారంగా హర్షకు కస్టమ్స్‌ నోటీసులు

చెన్నై: కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన చేతిగడియారాలను స్మగుల్‌ చేశారన్న ఆరోపణలపై తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్‌ 4వ తేదీన ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని హర్షను కోరినా.. తాను డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్నానని, విచారణకు రాలేనని ఆయన ఏప్రిల్‌ 3వ తేదీన తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఏప్రిల్‌ 27 తర్వాత విచారణకు వస్తానని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఒక వార్తా సంస్థతో మాట్లాడిన హర్ష రెడ్డి.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

మార్చి 28వ తేదీన జారీ చేసిన నోటీసులను హర్ష డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని వారి కుటుంబ కంపెనీ కార్యాలయంలో అందించారు. రెండు లగ్జరీ వాచ్‌లు పాటెక్‌ ఫిలిపె 5740, బ్రెగుయెట్‌ 2759.. హాంగ్‌కాంగ్‌కు చెందిన భారతీయుడు ముహమ్మద్‌ ఫహెర్దీన్‌ ముబీన్‌ అనే వ్యక్తి సింగపూర్‌ నుంచి చెన్నైకి వచ్చిన సందర్భంగా కస్టమ్స్‌ అధికారులు ఫిబ్రవరి 5వ తేదీన స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఈ వాచ్‌ల అసలు విలువ సుమారు 1.73 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ వర్గాలు చెబుతున్నాయి. పాటెక్‌ ఫిలిపెకు భారత్‌లో అసలు డీలరే లేరని, బ్రెగుయెట్‌ వాచ్‌లు భారత మార్కెట్‌లో లభించడం లేదని కస్టమ్స్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుపగా, హర్షరెడ్డికి ఈ వాచ్‌లు అందాల్సి ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. అలోకం నవీన్‌కుమర్‌ అనే మధ్యవర్తి ద్వారా ఈ వాచ్‌లు హర్షకు చేరాల్సి ఉన్నదని పేర్కొన్నారు. లగ్జరీ వాచ్‌ల డీలర్‌ అయిన నవీన్‌ను మార్చి 12న ప్రశ్నించినట్టు అధికారులు చెప్పారు. విచరాణ సందర్భంగా తాను ముబీన్‌, హర్షకు మధ్యవర్తిగా ఉన్నట్టు అంగీకరించాడని తెలిపారు.

హవాలా మార్గంలో క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు జరిపినట్టు కూడా అంగీకరించాడని పేర్కొన్నారు. దీనిపై హర్ష రెడ్డిని ఒక వార్తా సంస్థ సంప్రదించగా.. అవన్నీ ఆధార రహితమని చెప్పారు. అసలు వీటి గురించి తనకు ఏమీ తెలియదని కస్టమ్స్‌ అధికారులకు ఆయన సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. అయినప్పటికీ ఏప్రిల్‌ 27 తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా.. నవీన్‌కుమార్‌ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు మార్చి 18న తిరస్కరించింది. లగ్జరీ వాచ్‌ల స్మగ్లింగ్‌ ఒక దశలో వంద కోట్లకుపైగానే ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్టు పిటిషన్‌ను నిరాకరించింది. ఈ కేసులో అలందుర్‌ కోర్టులో రివ్యూ పిటిషన్‌ సందర్భంగా హర్ష రెడ్డిని ఇన్వెస్టిగేట్‌ చేయాలని, నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయాలని ఏప్రిల్‌ 1న ఆదేశాలు జారీ చేసినట్టు కస్టమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Latest News