విధాత, ప్రత్యేక ప్రతినిధి: విభేదాలు..విభేదాలే. పర్యటన ..పర్యటనే అనే తీరుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరు ఉందనే చర్చ ప్రారంభమైంది. మేడారం జాతర టెండర్ల అంశంలో సంబంధిత దేవాదాయ శాఖ మంత్రికి సంబంధం లేకుండా తన మనుషులకు కేటాయించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి వ్యవహరించారని రచ్చ సాగుతున్న నేపథ్యంలో ఇవేమీ పట్టనట్లు సోమవారం పొంగులేటి మేడారం పర్యటనకు సిద్ధం కావడం ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామంగా మారింది. మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలు బహిరంగమై బజారునపడ్డ విషయం తెలిసిందే.
తాజాగా ఈ విభేదాలకు మేడారం జాతర టెండర్లు మరింత ఆజ్యం పోయడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థితికి పరిస్థితి చేరింది. పొంగులేటిపై తీవ్ర అసహనంతో ఉన్న సురేఖ ఈ అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆదివారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధృవీకరించారు. ఇద్దరు మంత్రులు ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితి నెలకొన్న ఈ స్థితిలో పొంగులేటి మేడారం పర్యటనకు సిద్ధం కావడంతో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖతో విభేదాలున్నప్పటికీ ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో సీఎం రేవంత్ ఆదేశాల మేరకు మేడారంలో సాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. విభేదాలు నెమ్మదిగా పరిష్కరించుకోవచ్చు, అభివృద్ధి పనులు ఆగితే జాతరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున పొంగులేటి వీటన్నింటిని పక్కనపెట్టి మేడారం పర్యటనకు వస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సీఎం ఆదేశాల మేరకే ఆయన ఈ పర్యటనకు ప్రాధాన్యమిచ్చినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ మంత్రిగా తన ప్రమేయం లేకుండా జాతర టెండర్ల వ్యవహారం ముందుకు సాగడమే కాకుండా తనకు కనీస సంబంధం లేకుండా పొంగులేటి మేడారం పర్యటనకు రావడం పట్ల కొండా వర్గం రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం 9–30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మేడారం చేరుకుంటారు. అక్కడ వనదేవతల దర్శనం అనంతరం, పనులను పర్యవేక్షించనున్నారు. స్థానిక హరిత హోటల్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో తిరుగుపయనమవుతారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి పర్యటన ఖరారైనట్లు అధికారులు ప్రకటించారు. ఈమేరకు ములుగు జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేశారు. ఇదిలా ఉండగా పొంగులేటి ఆదివారం హనుమకొండకు వచ్చి వెళ్ళారు. నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి మృతి నేపథ్యంలో ఆయనను పరామర్శించారు. తిరిగి సోమవారం మేడారంలో పర్యటించనున్నారు. ఆదివారం మేడారాన్ని మంత్రి సీతక్క సందర్శించి, పనులు పరిశీలించారు. సోమవారం తిరిగి పొంగులేటితో పాటు సీతక్క పాల్గొనే అవకాశం ఉంది. ఇద్దరు మంత్రులు జాతర పనులపై సమీక్షించనున్నారు. అయితే దేవాదాయశాఖ మంత్రిగా కొండా సురేఖ హాజరవుతారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు సురేఖ పర్యటన మాత్రం ఖరారు కాలేదు. కాగా, పొంగులేటి, కొండా మధ్య విభేదాల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోరినట్లు మంత్రి సీతక్క ఆదివారం వెల్లడించారు. తాను ఎవరి పై ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పొంగులేటి, కొండా విభేదాల్లో తనకు సంబంధం లేదన్నారు.