బీఆరెస్ పాల‌న‌పై “ప‌వ‌ర్” పాయింట్‌

10 ఏళ్ల బీఆరెస్ పాల‌నలో ప్ర‌భుత్వం చేసిన అప్పులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది

  • Publish Date - December 19, 2023 / 04:15 PM IST
  • 60 ఏళ్ల‌లో నాటి రాష్ట్ర ప్రభుత్వాలు..
  • బీఆరెస్ సారథ్యంలోని పదేళ్ల సర్కార్‌..
  • చేసిన అప్పులెన్ని.. అభివృద్ధి ఎంత?
  • ప్ర‌జ‌ల‌పై ప‌డిన భారం పరిస్థితేంటి?
  • అసెంబ్లీలో తెరపై నేడే విడుదల
  • సిద్ధమైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  • బీఆరెస్‌ను ఇరుకునపెట్టనున్న డాటా!
  • గులాబీ నేతల స్పందనపై సర్వత్రా ఆసక్తి

విధాత‌, హైద‌రాబాద్‌: 10 ఏళ్ల బీఆరెస్ పాల‌నలో ప్ర‌భుత్వం చేసిన అప్పులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సర్కార్‌.. ఆ మేరకు శాసనసభ సాక్షిగా ఎల్‌ఈడీ తెరలపై వాస్తవ దృశ్యాలను ఆవిష్కరించబోతున్నదని అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్ర‌జంటేష‌న్ ద్వారా తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితి స‌మ‌గ్ర చిత్రాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నది.


రాష్ట్ర ప్ర‌భుత్వం కొలువుదీరిన మొద‌టి రోజు జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో అధికారులు చెప్పిన లెక్క‌లు విని విస్తుపోయిన మంత్రులు.. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ స‌ర్కారు చేసిన అప్పులు, చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌పై శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి ముందుగా.. ప్రస్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతుండ‌డంతో అసెంబ్లీ వేదిక‌గా రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని ప్ర‌జ‌ల ముందుంచాల‌ని ప్ర‌భుత్వం భావించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే బుధ‌వారం అసెంబ్లీ స‌మావేశంలోనే ఆర్థిక శాఖ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హిస్తున్న డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పవర్‌ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇవ్వ‌డానికి ప్రిపేర్ అయ్యారు. వ‌రుసగా ఆర్థిక శాఖ అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన ఆయ‌న ప్ర‌త్యేకంగా నోట్స్ త‌యారు చేసుకున్నార‌ని స‌మాచారం.

అప్పుల ఊబిలో…

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో ఆదాయం ఎంత‌? అప్పులెంత‌? తెచ్చిన అప్పులకు క‌డుతున్న కిస్తీలెంత‌? వ‌డ్డీ చెల్లింపులు ఎంత‌? ప్ర‌జ‌ల సంక్షేమానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్థి కోసం వెచ్చిస్తున్న నిధులెన్ని? ఇలా కీల‌క‌మైన అన్ని అంశాల‌పై అధికారుల‌ను స‌మాచారం అడిగారు. కొన్ని ప‌ద్దుల‌పై ఏవిధంగా ఖ‌ర్చు చేశారో చెప్పాలంటూ అధికారుల‌ను ప్ర‌శ్నించారు. అయితే అధికారులు చెప్పిన స‌మాధానం విని ప్ర‌భుత్వాధినేత‌లే విస్తుపోయారు. బ‌య‌ట స‌మాజానికి తెలంగాణ ప్ర‌భుత్వం అప్పు 5.50 ల‌క్ష‌ల కోట్ల‌ని మాత్ర‌మే తెలుసు. కానీ వాస్త‌వ అప్పులు 6.50 కోట్ల వ‌ర‌కు ఉంటాయని తెలిసి కాంగ్రెస్ ప్ర‌భుత్వ నేత‌లు అవాక్క‌య్యారు. ఇలా తెచ్చిన అప్పులు దేనికి ఖ‌ర్చు చేశార‌న్న దానిపై పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరించారని తెలుస్తున్నది.

2014 వరకూ తెలంగాణ అప్పులు 75 వేల కోట్లే!

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వాలు క‌లిపి 2014 వ‌ర‌కు తెలంగాణ‌కు చేసిన అప్పులు రూ.75 వేల కోట్లు మాత్ర‌మే. ఇందులో అత్య‌ధికంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీనే ప‌రిపాలించింది. అయితే ఈ చేసిన అప్పులతో శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్‌, పులిచింత‌ల‌, జూరాల‌, శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి, దేవాదుల‌, ఎగువ‌,మ‌ధ్య‌, దిగువ మానేరు, మంజీరా డ్యాం, శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, హైద‌రాబాద్‌కు కృష్ణా జ‌లాల త‌ర‌లింపు, హైద‌రాబాద్‌కు మంజీరా నీరు, ఔట‌ర్ రింగ్ రోడ్‌, పీవీ ఎక్స్ ప్రెస్‌ వే, మెట్రోరైల్‌, ఎంఎంటీఎస్ ఇలా అనేక ప్రాజెక్ట్‌లు చేప‌ట్టి, నిర్మించింది. అలాగే ఉచిత విద్యుత్తు, ఇందిర‌మ్మ ఇళ్ల‌తోపాటు అనేక‌ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేసింది. అయిన‌ప్ప‌టికీ 60 ఏళ్ల‌లో తెలంగాణ చేసిన అప్పు రూ.75 వేల కోట్లు దాటలేదు. అయితే.. 10 ఏళ్ల‌లోనే ఈ అప్పు రూ.6.50 ల‌క్ష‌ల కోట్ల‌కు ఎందుకు చేరింద‌న్న దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం బీఆరెస్‌ను అసెంబ్లీ వేదిక‌గా నిల‌దీయ‌నున్న‌దని చెబుతున్నారు.

అప్పు తెచ్చి చేసిందేంటి?

బీఆరెస్ అధికారంలోకి వ‌చ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల‌లో ఏకంగా రూ.6 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసింద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తున్న‌ది. దీంతో ఈ అప్పు రూ.6.50 కోట్ల‌కు పెరిగింద‌ని చెబుతున్నది. చేసిన అప్పుతో బీఆరెస్ చేసిన కార్య‌క్ర‌మాలేమిట‌న్న దానిపై కాంగ్రెస్ స‌ర్కారు ప్ర‌శ్నించ‌నున్న‌ది. ల‌క్ష కోట్ల‌తో క‌ట్టిన కాళేశ్వ‌రంలో నాణ్య‌త లేక పోవ‌డంతో మేడిగ‌డ్డ కుంగింద‌ని, అన్నారంలో బుంగ ప‌డింద‌ని, పైగా ఏమాత్రం వ‌ర‌ద వ‌చ్చినా మోటర్లు మునిగి పోతున్నాయ‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు చేసింది. ల‌క్ష కోట్ల‌తో నిర్మించిన కాళేశ్వ‌రంతో వాస్త‌వంగా ఎంత ఆయ‌క‌ట్టు వ‌చ్చిందో స‌భ‌కు తెలియ‌జేయాల‌న్న ఆలోచ‌నలో కూడా కాంగ్రెస్‌ ఉన్నట్టు చెబుతున్నారు. పాల‌మూరు -రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం హ‌డావిడి చేసినా ఎందుకు పూర్తి చేయ‌లేక పోయింది? ఖ‌మ్మం జిల్లాకుసాగు నీరు అందించే సీతారామ ఎత్తిపోతల ప‌థ‌కం ఎందుకు పూర్తి చేయలేక పోయారు? మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఎన్ని గ్రామాలకు తాగు నీరు ఇస్తున్నారు? మిష‌న్ కాక‌తీయ ప‌థ‌కం ద్వారా ఎన్ని చెరువులు బాగు చేశారు? వాటికి పెట్టిన ఖ‌ర్చు ఎంత‌? ఇలా ఈ ప్రాజెక్ట్‌ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన ఖ‌ర్చు ఎంత‌? వాస్త‌వంగా చేసిన అప్పులెన్ని? మిగ‌తా సొమ్ము ఏమైంది? ధ‌నిక రాష్ట్రం అని చెప్పిన బీఆరెస్‌ ప్రభుత్వం.. ఉద్యోగులకు ఒక‌ట‌వ తేదీన ఎందుకు జీతాలు ఇవ్వ‌లేక పోయింది? క‌నీసం కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు ఎందుకు స‌కాలంలో చెల్లించ‌కుండా పెండింగ్‌లో పెట్టారు? ఇలాంటి అనేక విష‌యాల‌పై భ‌ట్టి అసెంబ్లీలో స‌వివ‌రంగా తెలియ‌జేసే అవ‌కాశం ఉందని సమాచారం.

అప్పుల భారం బీఆరెస్‌దే!

బీఆరెస్ ప్రభుత్వం అనాలోచితంగా, అశాస్త్రీయంగా చేసిన అప్పుల భారం తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప‌డింద‌ని కాంగ్రెస్‌ వివరించే ప్రయత్నం చేయనున్నది. వీట‌న్నింటిని తీమ ప్రభుత్వం ప‌రిశీలించి, స‌మీక్షించి, రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని, రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయ వ‌న‌రుల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌తో పాటు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని స‌భ ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చేప్పే ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ది.