ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగలు .. ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తూ శిలాఫలకాల ధ్వంసం

బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు కొందరు రెండు పార్టీల కేడర్ నుంచి నిరసనలు ఎదుర్కోంటున్న విచిత్ర పరిస్థితి నెలకొంది

  • Publish Date - July 3, 2024 / 03:05 PM IST

విధాత, హైదరాబాద్: బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలు కొందరు రెండు పార్టీల కేడర్ నుంచి నిరసనలు ఎదుర్కోంటున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. గెలిపించిన పార్టీని వీడి ప్రత్యర్థి పార్టీలో చేరిపోయారంటూ బీఆరెస్ కార్యకర్తలు ఒకవైపు, తమను ఇంతకాలం ఇబ్బందులు పెట్టిన వారు అధికారం కోసం మళ్లీ మా పార్టీలో చేరడం ఏమిటంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు పార్టీలు మారిన ఎమ్మెల్యేల పట్ల తమ అసంతృప్తిని నిరసనల రూపంలో వెళ్లగక్కుతున్నారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి, ఆయన వర్గీయులు బహిరంగ అసమ్మతి వ్యక్తం చేశారు. నెమ్మదిగా ఆ వ్యవహారం సద్దుమణిగిన క్రమంలో తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు అదే పరిస్థితి ఎదురైంది. తాము ఇంతకాలం ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడామో వారే ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమపై పెత్తనం చేసే పరిస్థితులను క్షేత్ర స్థాయిలో కేడర్ జీర్ణించుకోలేపోతుంది. కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఇటీవలే వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ నిరాహార దీక్ష నిర్వహించారు. తాజాగా ఎమ్మెల్యే కాలే యాదయ్య తన నియోజకవర్గం చేవెళ్ల పరిధిలోని నవాబ్ పేట మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సివుంది. ఆయన పర్యటనను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యక్రమాలలో పాల్గొనబోమంటూ శిలఫలకాలను ధ్వంసం చేశారు. దీంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Latest News