Site icon vidhaatha

కాళేశ్వరం లక్ష్యంగా కాంగ్రెస్ కదం.. కేసీఆర్‌పై రాహుల్ తీవ్ర ఆరోపణలు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యంగా ఎన్నికల కదన రంగంలో కాంగ్రెస్ కార్యాచరణను అమలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బరాజ్, అన్నారం సరస్వతి బరాజ్‌లలో వెలుగు చూసిన సంఘటనలు కాంగ్రెస్‌కు అస్త్రంగా మారాయి. ఈ సంఘటనలను కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ఎజెండాగా మార్చుకొని ముందుకు సాగుతూ ఉంది.


ఇంతకాలం కేసీఆర్‌ చెప్పినట్లు తమ మానస పుత్రికగా భావించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఆ పార్టీకి కంటిలో నలుసుగా మారింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాళేశ్వరంలోని నాణ్యత ప్రమాణాలపై విమర్శలు ఎక్కు పెట్టడంతో కాంగ్రెస్‌కు మంచి మైలేజీనిస్తోంది. కొంతకాలంగా కాళేశ్వరం పట్ట విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఒకింత విశ్వాసం కలిగించలేకపోయారు. కానీ ఎన్నికల ప్రచార సమయంలో మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడం, అన్నారం వద్ద బుంగపడడం కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాలకు కలిసొచ్చింది.


బీఆర్ఎస్ కేసీఆర్‌కు ఇబ్బంది


కాళేశ్వరంలో వెలుగు చూస్తున్న లోటుపాట్ల ప్రభావం ప్రాజెక్టు పై ఎంత ఉంటుందనేది పక్కకు పెట్టినా, ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కాళేశ్వరంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేని పరిస్థితిల్లో ఉన్నారు. దబాయింపు ధోరణి, సంఘటన జరగగానే కుట్రకోణం ఉందనే వైపు చర్చను మళ్ళించడం కోసం చేసిన ప్రయత్నం, ఎజెండా నుంచి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తూ చర్చల్లో లేకుండా చేయాలని మౌనం వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ కాళేశ్వరం లక్ష్యంగా విమర్శలను తీవ్రం చేసింది.


ఏకంగా రాహుల్ గాంధీ పర్యటనతో పతాక స్థాయికి చేరింది. పైకి ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో నెలకొన్న లోపాలు ఇప్పుడు ఆ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. మేడిగడ్డ సంఘటన జరగగానే బరాజ్‌లో నిల్వా ఉంచిన పది టీఎంసీల నీటిని కిందికి విడుదల చేయడం, కాపర్ డాం నిర్మాణం చేపట్టాల్సి ఉందంటూ అధికారులు స్వయంగా ప్రకటించడం, నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోలేదనే దానికి నిదర్శనంగా మారుతున్నాయి.


మరోవైపు కేంద్రంలోని బిజెపి కూడా కాళేశ్వరంపై విమర్శలు ఎక్కువ పెడుతోంది. మేడిగడ్డ సంఘటన జరగగానే కేంద్రానికి బిజెపి లేఖ రాయడం, హుటాహుటిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ పరిశీలించినప్పటికీ నివేదికను ఇంకా బహిరంగం చేయకపోవడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి.


రాహుల్ పర్యటనతో తీవ్ర చర్చ


పిల్లర్ల కుంగుబాటుకు గురైన మేడిగడ్డ ప్రాజెక్టును గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలించారు. గత నెల 21వ తేదీన మేడిగడ్డ పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు నాణ్యత, డిజైన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మేడిగడ్డను సందర్శించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది. అందుకే రాహుల్ పర్యటనను ఒకరోజు పొడిగించి మరి అనుమతులు, అభ్యంతరాల మధ్య పర్యటనను విజయవంతం చేసుకున్నారు.



కాళేశ్వరం కేసీఆర్ ఎటిఎం: రాహుల్


ఇప్పటికే రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, అన్నారం వద్ద బుంగపడడంతో ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లేవని ఆరోపణలకు ఊతమిస్తూ వస్తున్నాయి. రాహుల్ గాంధీ పర్యటనతో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది.


ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు తమ ఘనతగా చెప్పుకుంటున్న సందర్భంలో అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. ఈ సందర్భంగా అంబటిపల్లిలో ఏర్పాటుచేసిన మహిళల మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంగా మారింది అంటూ మండిపడ్డారు.


రాహుల్ వెంట రేవంత్, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టును చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు బారికేడ్లు తోసుకొని వెళ్లడంతో మేడిగడ్డ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే మేడిగడ్డ వద్ద రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ విధించారు.


తెలంగాణకు కాళేశ్వరం గుదిబండ: భట్టి విక్రమార్క


తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై అప్పులు భారం మోపిన ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఏటీఎంగా ఉపయోగపడుతుందన్నారు. నాణ్యత లేకపోతే ఇలాంటి సమస్యలే తలెత్తుతాయని అన్నారు. ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేని రోజులలో గోదావరిపై కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు కట్టిందని అవి అనేక వరదలు, విపత్తులను తట్టుకొని నిలబడ్డాయన్నారు. కాళేశ్వరం కట్టిన కొద్ది కాలానికి దాని లోపాలు వెలుగు చూస్తున్నాయని విమర్శించారు.


 


కాళేశ్వరం ఖర్చు కూడా విపరీతంగా పెంచారన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం నాణ్యత లోపంతో ఉందన్నారు. డబ్బులు ఇష్టానుసారం విడుదల చేశారని, సగం డబ్బులు మాత్రమే ఖర్చు చేశారని అందుకే నాణ్యత లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టును ప్రజలు సందర్శించకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలపై ఐటి సాగిస్తున్న దాడులను బట్టి విక్రమార్క ఖండించారు. బీఆర్ఎస్ గెలిచేందుకు బిజెపి సహకారంతో ఈ దాడులు సాగుతున్నాయని విమర్శించారు.

Exit mobile version