Toll Tax | ఫాస్టాగ్ (Fastag) లేకుండా జాతీయ రహదారుల (National Highways)పై ప్రయాణించే వాహనదారులకు కీలక అలర్ట్. టోల్ ప్లాజాల (toll plaza) వద్ద నగదు చెల్లింపులను (Cash payments) పూర్తిగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి నగదు స్వీకరణ నిలిపివేయాలని ఎన్‌హెచ్‌ఏఐ (National Highways Authority of India) పరిశీలిస్తోంది. ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ ఫీజును వసూలు చేయాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, టోలింగ్ ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం ప్రకటించింది. రోడ్లపై వాహనాలు బారులు తీరి ఉండటాన్ని నిరోధించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనదారుల ప్రయాణం మరింత సులభతరం కానుంది.
98 శాతం ఫాస్టాగ్ ద్వారానే..
కాగా, జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు ఫాస్టాగ్ తప్పనిసరిగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరగుతున్నాయి. 98 శాతానికి పైగా వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారు. ఫాస్టాగ్ లేకపోవడం, పని చేయకపోవడం వంటి కారణాలతో వాహనదారులు టోల్ రుసుమును రెండింతలు చెల్లిస్తున్నాయి. నగదు రూపంలో అయినా యూపీఐ ద్వారా చెల్లించినా ఇదే నిబంధన వర్తిస్తోంది. నేషనల్ హైవేలపై టోల్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటే.. రూ.200 వరకూ వసూలు చేస్తున్నారు. యూపీఐ (UPI Payments) ద్వారా అయితే 25 శాతం అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే రూ.100కు 25 శాతం అదనంగా అంటే రూ.125 చెల్లించి వెళ్లొచ్చు.
డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకే
ఇకపై టోల్ ప్లాజాల వద్ద పూర్తిగా డిజిటల్ చెల్లింపులను మాత్రమే అనుమతి ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం ఎన్‌హెచ్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో జాతీయరహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై 1150 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఇక కేంద్రం ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 50 లక్షలకుపైగా వాహనదారులు ఈ పాస్‌ను వినియోగిస్తున్నారు. ఆరు నెలల్లోనే 26.55 కోట్లకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి. ఒకేసారి చెల్లింపుతో ఏడాది పాటు నిర్దిష్ట టోల్ చెల్లింపుల వరకు మళ్లీ రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Delhi | ఢిల్లీకి ఉగ్ర ముప్పు.. ఎర్రకోట వద్ద హైఅలర్ట్
Kamareddy BJP Congress clashes| కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల మధ్య దాడులు.. ఉద్రిక్తత
