కార్లకు ఫాస్టాగ్​పై KYV అవసరం లేదు: ఫిబ్రవరి 1 నుంచి NHAI వెసులుబాటు

2026 ఫిబ్రవరి 1 నుంచి కార్లకు జారీ చేసే కొత్త ఫాస్టాగ్‌లపై KYV ప్రక్రియను NHAI రద్దు చేసింది. యాక్టివేషన్‌కు ముందు VAHAN ఆధారిత ధృవీకరణ తప్పనిసరి. ఇప్పటికే ఉన్న కార్ ఫాస్టాగ్‌లకు ఫిర్యాదులు ఉన్నప్పుడే KYV ఉంటుంది.

కార్లకు ఫాస్టాగ్​పై KYV అవసరం లేదు: ఫిబ్రవరి 1 నుంచి NHAI వెసులుబాటు

No Routine KYV for Car FASTags from Feb 1st : NHAI

విధాత నేషనల్​ డెస్క్​ | హైదరాబాద్​:

న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ప్రయాణించే కార్ల యజమానులకు ఉపశమనంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కార్ / జీప్ / వ్యాన్ కేటగిరీలో జారీ చేసే కొత్త ఫాస్టాగ్​లకు Know Your Vehicle (KYV) ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మార్పులు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.

ఇప్పటి వరకు ఫాస్టాగ్​ యాక్టివేషన్ తర్వాత KYV కారణంగా ఎదురవుతున్న ఆలస్యాలు, ఫాలోఅప్స్‌, అసౌకర్యాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై కార్లకు సంబంధించిన వాహన ధృవీకరణ బాధ్యత మొత్తం ఫాస్టాగ్​ జారీ చేసే బ్యాంకులదే అవుతుంది.

యాక్టివేషన్‌కు ముందే ధృవీకరణ: బ్యాంకులదే బాధ్యత

FASTag vehicle verification to be completed before activation under new NHAI rules

కొత్త విధానం ప్రకారం, ఫాస్టాగ్ యాక్టివేషన్‌కు ముందే వాహన వివరాల ధృవీకరణ పూర్తవాలి. ఇందుకోసం VAHAN డేటాబేస్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. వాహన వివరాలు VAHANలో లభించని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఆధారంగా వెరిఫికేషన్ చేయాలి. కానీ, దానికి సంబంధించి పూర్తి బాధ్యత ఇకనుండి బ్యాంకులదే.

ఇప్పటివరకు అమలులో ఉన్న యాక్టివేషన్ తర్వాత వెరిఫికేషన్ ()విధానాన్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఆన్‌లైన్‌లో విక్రయించే ఫాస్టాగ్లు కూడా బ్యాంక్ ధృవీకరణ పూర్తయ్యాకే యాక్టివేట్ చేయాలని NHAI స్పష్టం చేసింది.

ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్ల విషయంలో సాధారణంగా KYV అవసరం ఉండదు. లూజ్ ట్యాగ్‌లు, తప్పుగా జారీ కావడం, దుర్వినియోగం వంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే KYV ప్రక్రియ చేపడతారు. ఎలాంటి ఫిర్యాదు లేని సందర్భాల్లో ఎటువంటి అదనపు ధృవీకరణ ఉండదు.

ఈ మార్పులు కేవలం ప్రయాణీకుల కార్లకు మాత్రమే వర్తిస్తాయి. ట్రక్కులు, మల్టీ-యాక్సిల్ వాహనాల వంటి కమర్షియల్ వాహనాలకు ప్రస్తుత విధానమే కొనసాగుతుంది.

NHAI ఆదేశాల ప్రకారం, ఈ సంస్కరణలు ఫాస్టాగ్ వ్యవస్థను మరింత పౌరహితంగా, పారదర్శకంగా, సాంకేతికత  ఆధారంగా మార్చడమే కాకుండా, ఫిర్యాదులు తగ్గించి వ్యవస్థలో మార్పులను బలోపేతం చేయనున్నాయి.