Ramya Rao : ఈడీ ఆఫీస్ వద్ద రమ్యరావు…సంతోష్ రావుపై ఫిర్యాదు

సంతోష్ రావుపై ఈడీకి రమ్యారావు ఫిర్యాదు! భూ ఆక్రమణలు, అమెరికాలో 1000 ఎకరాల ఆస్తులపై దర్యాప్తుకు విన్నపం. భూదందాల సొమ్మును లిక్కర్ స్కామ్‌లో పెట్టారని కేసీఆర్ మేనకోడలు సంచలన ఆరోపణ.

Ramya Rao

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సోదరుడి కుమార్తె రమ్యారావు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమై సంచలనం రేపారు. మాజీ ఎంపీ సంతోష్ రావు భూ ఆక్రమణలపై విచారణ జరుపాలని కోరుతూ ఆమె ఈడీకి ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యరావు ఈడీకి సమర్పించారు. పోలీసులను, తశీల్దార్ స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా భూదందాలు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బును లిక్కర్ స్కామ్‍లో పెట్టారని ఆరోపించారు. సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని ఆమె తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజుల్లో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్ రావు అవినీతి బాగోతం మొత్తం వివరిస్తానని రమ్యారావు తెలిపారు. ఇప్పటికే సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు చేశామని ఇప్పుడు ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు.

రమ్యారావు గతంలోనూ… 2007లో ఎలగందులలో తాను కొనుగోలు చేసిన రెండెకరాల భూమిని సంతోష్ ఆక్రమించారని.. అందులో గ్రానైట్ వ్యర్థాలు వేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2009లో రూ.7కోట్ల ఆస్తులున్న సంతోష్ 2013లో గ్రానైట్ క్వారీ భాగస్వామ్య తీసుకుని అనేక భూకబ్జాలకు పాల్పడుతున్నారని మీడియా సమావేశాల్లో ఆరోపించారు. 2015లో మిడ్‌ మానేర్‌ ముంపు బాధితుడిగా 2 గుంటల పట్టా భూమి అందుకున్న సంతోష్‌కు కోకాపేట వంటి ఖరీదైన ప్రాంతాల్లో 200 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. 10ఏళ్ల కేసీఆర్ దొర పాలనలో వేల కోట్ల రూపాయలు దోచేసిన సంతోష్ రావు అమెరికాలో జెఎస్ రాంచ్ పేరిట 1000ఎకరాల భూములకు యజమానిగా మారాడని ఆరోపించారు. గూగుల్ లో సెర్చ్ చేస్తే దాని వివరాలు కూడా తెలుసుకోవచ్చంటూ రమ్యారావు ఆరోపణలు చేశారు. తాజాగా మరోసారి సంతోష్ రావుపై రమ్యారావు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Andhra Pradesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!
Karnataka DGP Ramachandra Rao : ఆఫీసులో డీజీపీ ర్యాంకు అధికారి రాసలీలలు..వీడియో వైరల్

Latest News