– పథకాల అమలుకు లింక్
– పదేళ్లుగా కార్డుల ఊసెత్తని గత సర్కారు
– ఉన్న కార్డుల్లోనూ అనర్హులు
– కొత్త కార్డులు ఇవ్వకుండా ముందుకు ఎలా?
– లింక్ చేస్తే ఇబ్బందేనంటున్న పరిశీలకులు
విధాత: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఇతర పథకాలకు రేషన్ కార్డు లింక్ చేస్తున్నదా? అయితే అమలు ఎలా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ తరువాత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పథకాల అమలుకు రేషన్ కార్డు లింక్ చేస్తామని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు, ఉన్న రేషన్ కార్డుల్లో చాలా మంది అనర్హులున్నారన్న చర్చ ఉంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు. 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇచ్చిన రేషన్ కార్డులే నేటికి ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 90.14 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఈ కార్డుల ద్వారా 2.83 కోట్ల మందికి లబ్ధి జరుగుతోంది. అయితే ఈకార్డుల్లో కొంతమంది అనర్హులుండే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది.
కుప్పలు తెప్పలుగా పెండింగ్ దరఖాస్తులు
గత ప్రభుత్వం రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్‌నది కానీ కార్డులు ఇవ్వలేదు. ఆ దరఖాస్తులన్నీ నేటికి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో జిల్లా నుంచి 50 వేల దరఖాస్తులు వచ్చి చేరాయి. ఉన్న రేషన్ కార్డులలో పిల్లల పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు 60 వేల నుంచి 90 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇలా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడంతోపాటు కొత్త వారికి కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. 10 ఏళ్లకు ఇప్పటికీ జనాభా పెరిగింది. ప్రతి ఏటా వేలాది మంది యువతీ యువకులకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొత్త కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఏర్పడిన కుటుంబాలకు ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితిని బట్టి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు.
అర్హుల్లో నష్టపోతామన్న ఆందోళన
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాకుండా పథకాల అమలుకు రేషన్ కార్డులకు లింక్ పెడితే చాలామంది అర్హులు నష్టపోతారని సామాజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ మన్నె నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకాలకు రేషన్ కార్డు లింక్ చేయడమో, ఐటీని లింక్ చేయడమో కరెక్ట్ కాదని చెప్పారు. చాలామంది రైతులు తమ పిల్లలను విదేశాల్లో చదివించడం కోసం లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించి, ఆ మేరకు ఐటీ రిట్నర్ దాఖలు చేశారని, కొంతమంది అప్పులు చేసి మరీ ఐటీ కట్టి చూపించి తమ పిల్లలను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపించారన్నారు. అలాంటి పేద రైతులు, చిరుద్యోగులు అనేక పథకాలకు దూరం అవుతారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
గ్రామసభలపై తొలగని సందేహాలు
ప్రభుత్వం ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రజా పాలనలో ఏమి చేయాలో నిర్దేశించింది. ప్రజా పాలన గ్రామ సభలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే ఆసరా పెన్షన్లు, రైతు బంధు వస్తున్న వారు కూడా వీటికి దరఖాస్తు చేసుకోవాలా? వద్దా? అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయలేదు. దీంతో రైతు బంధు పథకం అందుకుంటున్న రైతుల్లో, ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై ఒక స్పష్టత ఇవ్వక పోవడంతో అటు అధికారుల్లో కూడా ఎలా ముందుకు వెళ్లాలన్న సందేహాలు వచ్చాయి. ఇటు లబ్ధిదారుల్లో కూడా తమకు వచ్చే పెన్షన్ వస్తుందా? రాదా అన్న బెంగ పట్టుకున్నది.
వరుస దరఖాస్తులతో అయోమయమే..
ఈ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సర్కారు భావిస్తే ముందుగా రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని, రేషన్ కార్డులతో పాటుగానే ఈ పథకాలు వరుసగా అమలు చేయాలని కోరుతున్నారు. ఒక్క దరఖాస్తుతోనే రేషన్ కార్డుతో పాటు ఇతర పథకాలన్నీ అమలు జరిగేలా చూడాలంటున్నారు. అయితే రైతు భరోసాకు మాత్రం భూమి కటాఫ్ నిర్ణయించి అమలు చేయాలన్న అభిప్రాయాన్ని రైతుల కోసం పని చేస్తున్న వివిధ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. అలాగే కౌలు రైతుల గుర్తింపులో పక్క రాష్ట్రాల అనుభవాలను తీసుకుంటే మంచిదని మన్నెనర్సింహారెడ్డి తెలిపారు.