కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రస్థానం
విధాత:రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రి వరకు ఎదిగారు. 1980 నుంచి 1994 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనరుగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1992లో యువమోర్చా జాతీయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, 1993 నుంచి వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.2004లో తొలిసారి హిమాయత్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 నుంచి 2016 వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి ఓటమిపాలై, 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. కేంద్ర సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
జలవివాదాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది
కేంద్ర సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో బుధవారం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నవభారత నిర్మాణం కోసం ప్రధాని మోదీ స్వప్నాన్ని సాకారం చేయడం, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం.. ప్రస్తుతం ఈ రెండు వ్యూహాలు తన ముందున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదంపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.