Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై మరో రెండుమూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల అవుతాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్ల కన్నా ఎక్కువే ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే దాదాపు రూ. 9 వేల కోట్లు సమీకరించామని చెప్పారు. మిగతావి ఆ సమయానికి తెచ్చి రుణమాఫీ క్లియర్ చేస్తాం.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల నిధుల సమీకరణకు కష్టపడుతున్నాం అని పొంగులేటి పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తాం. అప్పీల్‌కు అవకాశం ఇస్తాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి కనీసం ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండాలని భావిస్తున్నాం. గతేడాదితో పోల్చితే గత ఐదారు నెలల్లో కమర్షియల్, ఆఫీస్ స్పేస్ లీజు పెరిగింది. ఇండ్ల అమ్మకం అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. కొన్ని చేసిన పనులు కూడా చెప్పుకోవడంలో మేము వెనకబడ్డాం. ఉదాహరణకు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద సుమారు రూ.680 కోట్లు ఖర్చు చేశాం. కానీ చెప్పుకోలేకపోయాం అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. గతంలో 2.45 లక్షల దరఖాస్తులు ఉండగా, తర్వాత మరో లక్ష దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం పరిష్కరించగా లక్షలోపు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల నాటికి వీటిని పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్నవారికి డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఇకపై.. 6 నెలల్లోగా తిరిగి ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు చేస్తాం అని మంత్రి పేర్కొన్నారు.