హైద‌రాబాద్‌లో త్వ‌ర‌లో మైక్రో స‌ర్జ‌రీ, రోబోటిక్ వైద్య‌ప‌రిక‌రాల త‌యారీ ప‌రిశ్ర‌మ‌

రోబోటిక్ వైద్య‌ప‌రిక‌రాలు, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, మైక్రో స‌ర్జ‌రీకి ఉప‌యోగించే అధునాత‌న ప‌రిక‌రాల‌ను త‌యారు చేసే ప‌రిశ్ర‌మ యూనిట్‌ను హైద‌రాబాద్‌లో

  • Publish Date - January 18, 2024 / 12:15 PM IST
  • రూ.231.5 కోట్ల పెట్టుబ‌డికి ముందుకు వ‌చ్చిన‌ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్

విధాత‌: రోబోటిక్ వైద్య‌ప‌రిక‌రాలు, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, మైక్రో స‌ర్జ‌రీకి ఉప‌యోగించే అధునాత‌న ప‌రిక‌రాల‌ను త‌యారు చేసే ప‌రిశ్ర‌మ యూనిట్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డానికి యూకేకు చెందిన ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ ( ఎస్ ఐ జీ హెచ్‌)ముందుకొచ్చింది. ఈ మేర‌కు దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో ఈ సంస్థ ఎండీ గౌరీశ్రీ‌ధ‌ర్‌, డైరెక్ట‌ర్ అమ‌ర్ చీడిపోతులు స‌మావేశ‌మై అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌ను హైద‌రాబాద్‌లో నెల‌కొల్పి ఇప్పటి వరకు దేశంలో తయారు చేయని పలు సర్జికల్ పరికరాలను ఇక్కడ తయారు చేయ‌నున్న‌ది. రాబోయే రెండు మూడు ఏళ్ల‌లో అందుకు అవసరమయ్యే రూ.231.5 కోట్ల పెట్టుబడులు పెడుతామని ఈ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఈ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఈ ఫెసిలిటీ ఏర్పాటుతో హెల్త్ కేర్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చిన ఈ సంస్థ ప్ర‌తినిధుల‌కు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. 

ఈ ప్రాజెక్టు మొదటి దశలో జనరల్ సర్జికల్ పరికరాలు, మైక్రో సర్జరీకి ఉపయోగించే అధునాతన పరికరాలను తయారు చేస్తారు. ఆర్థోపెడిక్, చర్మ, నేత్ర సంబంధిత సున్నితమైన సర్జరీలకు అవసరమయ్యే ప‌రిక‌రాలు తయారు చేస్తుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను తయారీ చేసేలా యూనిట్ ను విస్తరిస్తామ‌ని సీఎం కు వారు తెలిపారు. ఎస్ఐ జీహెచ్‌ యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్, అక్కడి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ) హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు తమ పరికరాలను సరఫరా చేస్తోంది.