విధాత, హైదరాబాద్: రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. డిసెంబర్ నెల వేతనాలన్నీ ఉద్యోగులకు ఇచ్చామని, ఇక మొదటి ప్రియార్టీగా రైతు బంధు ఇవ్వడమేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం నుంచి రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత సర్కారు కన్నా ముందుగానే రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు జమ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెపుతున్నారు.
సాధ్యమైనంత త్వరగా పూర్తి
రాష్ట్రంలో మొత్తం 65 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 27 లక్షల మంది రైతులకు రైతు బంధు నిధులు ఇచ్చారు. యాసంగి రెండవ పంట వేయడానికి రైతులకు పెట్టుబడి సహాయం యధావిధిగా అందించాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయించింది. దీంతో కాటాఫ్ లేకుండా రెండవ పంటకు నిధులు విడుదల చేస్తున్నారు. గత ఏడాది బీఆరెస్ సర్కారు రెండవ పంట యాసంగి రైతు బంధు నిధులు మార్చి వరకు ఇచ్చింది. ఇప్పుడు అలా కాకుండా సాధ్యమైనంత త్వరగా రైతులకు అందించనున్నారు.
వర్షాకాలం నుంచి కౌలురైతులకు కూడా…
ప్రస్తుతానికి రైతు బంధు నిధులే జమ చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. వర్షాకాలం సాగు నుంచి రైతు భరోసా అమలు చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. ఈ మేరకు రైతు బంధులో మార్పులపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విస్త్రృతంగా చర్చించనున్నారు. రైతు భరోసా ఏ విధంగా అమలు చేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలి? కౌలు రైతులకు ఏవిధంగా రైతు భరోసా ఇవ్వాలన్న దానిపై అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఒక మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలా రైతు బంధులో మార్పులపై చర్చించిన తరువాతనే కౌలు రైతులకు అమలు జరుగుతుందంటున్నారు. ఈ మేరకు ప్రజాపాలనలో తీసుకున్న ధరఖాస్తులో కూడా రైతు భరోసా కేటగిరి ఉంది. ఇందులో భూమి యజమాని, కౌలురైతు ఇలా రెండు కేటగిరిలను దరఖాస్తులో పొందుపరిచారు. దీంతో కౌలు రైతులందరికి రైతు భరోసా వస్తుందన్న ధీమా ను కాంగ్రెస్ సర్కారు కలిగించింది. అయితే ఈ యాసంగి పంటకు మాత్రం పాత రైతు బంధునే అమలు చేస్తున్నారు.